ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Brahmotsavam Start in Tirumala Sri Venkateswara Swamy Temple - Sakshi

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సా.5.23 నుంచి6 గంటల్లోపు మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. నేడు శ్రీవారికి సీఎం వైఎస్‌ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

తిరుమల/సాక్షి, అమరావతి :  తిరుమల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరఫున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగింపుగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,  అధికారులు  పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.

నేడు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒకే కుటుంబంలో తండ్రీ తనయులు ఇద్దరికీ ఈ అవకాశం దక్కడం విశేషం. కాగా, తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకుళాదేవి అతిథి గృహాన్ని సీఎం  ప్రారంభిస్తారు.  భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు తిరుమలలోని గోవర్ధన గిరి చౌల్ట్రీ వెనుక భాగంలో రూ.79 కోట్లతో పీఏసీ  నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top