
బోయ నరేంద్రబాబు, డాక్టర్ వైవీ మల్లారెడ్డి
సాక్షి, అనంతపురం: ‘అగ్రికల్చర్ మిషన్’ సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి సోమవారం జీఓ విడుదల చేశారు. అగ్రికల్చర్ మిషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డిని నియమించారు. సభ్యులుగా రైతుల కోటాలో జిల్లాకు చెందిన బోయ రాజారాంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. కీలకమైన అగ్రికల్చర్ మిషన్‌లో ఇతర సభ్యులుగా వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పశుసంవర్ధక శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా: బోయ నరేంద్రబాబు
అగ్రికల్చర్ మిషన్‌లో సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. తన నియామకానికి కృషి చేసిన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుంటా. రైతుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తా. ముఖ్యంగా కరువు సీమలో రైతులు పడుతున్న ఇబ్బందులు ‘అగ్రికల్చర్ మిషన్’ ద్వారా తొలిగిపోతాయి. నా జీవితాంతం రైతుల కోసమే శ్రమిస్తా.