బ్యాటరీ కారుతో బుడ్డోడి హల్‌చల్‌

Boy Drives Toy Battery Car Into Busy Road In Vijayawada - Sakshi

కారుతో రోడ్డెక్కిన నాలుగేళ్ల చిన్నారి

విజయవాడ పీఅండ్‌టీ కాలనీ నుంచి బెంజిసర్కిల్‌ వరకు డ్రైవింగ్‌

సర్కిల్‌లో పోలీసులను చూసి రివర్స్‌గేర్‌ వేసి వెళ్లేందుకు యత్నం

స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు.. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగింత

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని బెంజి సర్కిల్‌.. మంగళవారం ఉదయం 9.30 గంటలు. భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలతో ఆ సర్కిల్‌లోని నాలుగు రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బందరురోడ్డు మీదుగా బెంజిసర్కిల్‌ వైపు ఓ బ్యాటరీ కారు పరుగులు పెడుతూ.. భారీ వాహనాలను దాటుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాఫిక్‌ ఆగిపోవడంతో ఆ కారు ‘ఎస్‌’ కట్‌లు కొడుతూ ఇతర వాహనాలను తప్పిస్తూ జాతీయ రహదారి పైకి చేరుకుంది. ఒక్కసారిగా ట్రాఫిక్‌కు అడ్డంగా కారు రావడంతో అక్కడే విధులు నిర్వహిçస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు కారుని అడ్డుకున్నారు. కారు డ్రైవింగ్‌ చేస్తున్న నాలుగేళ్ల బుడ్డోడిని చూసి అవాక్కయ్యారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌ కుమారుడు శ్రీరామ్‌ (4) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. కాలికి దెబ్బ తగలడంతో శ్రీరామ్‌ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. తన ఎలక్ట్రిక్‌ కారుతో శ్రీరామ్‌ ఇంటి వద్ద ఆడుకుంటూ పీఅండ్‌టీ కాలనీ నుంచి పంటకాలువ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా బెంజిసర్కిల్‌ వద్దకు వచ్చేశాడు. ఎలాంటి భయం లేకుండా భారీ వాహనాలను దాటుకుంటూ కారుని జాతీయ రహదారిపైకి తీసుకు వచ్చేశాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేసి కారును పక్కకు తీసుకొచ్చారు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ బుడ్డోడు వచ్చిన వైపునే కుర్రాడిని తీసుకుని పోలీసులు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో తన మనవడిని వెతుక్కుంటూ ఓ వృద్ధురాలు రావడం చూసిన పోలీసులు ఆమెకు చిన్నారిని చూపించగా..ఆమె తన మనవడే అని తెలిపింది. ఆ చిన్నారిని ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top