breaking news
toy car
-
బెంజిసర్కిల్‌లో బ్యాటరీ కారు పరుగులు..
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని బెంజి సర్కిల్.. మంగళవారం ఉదయం 9.30 గంటలు. భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలతో ఆ సర్కిల్లోని నాలుగు రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బందరురోడ్డు మీదుగా బెంజిసర్కిల్ వైపు ఓ బ్యాటరీ కారు పరుగులు పెడుతూ.. భారీ వాహనాలను దాటుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాఫిక్ ఆగిపోవడంతో ఆ కారు ‘ఎస్’ కట్లు కొడుతూ ఇతర వాహనాలను తప్పిస్తూ జాతీయ రహదారి పైకి చేరుకుంది. ఒక్కసారిగా ట్రాఫిక్‌కు అడ్డంగా కారు రావడంతో అక్కడే విధులు నిర్వహిçస్తున్న ట్రాఫిక్ పోలీసులు కారుని అడ్డుకున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న నాలుగేళ్ల బుడ్డోడిని చూసి అవాక్కయ్యారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ కుమారుడు శ్రీరామ్ (4) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. కాలికి దెబ్బ తగలడంతో శ్రీరామ్ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. తన ఎలక్ట్రిక్ కారుతో శ్రీరామ్ ఇంటి వద్ద ఆడుకుంటూ పీఅండ్‌టీ కాలనీ నుంచి పంటకాలువ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా బెంజిసర్కిల్ వద్దకు వచ్చేశాడు. ఎలాంటి భయం లేకుండా భారీ వాహనాలను దాటుకుంటూ కారుని జాతీయ రహదారిపైకి తీసుకు వచ్చేశాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేసి కారును పక్కకు తీసుకొచ్చారు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ బుడ్డోడు వచ్చిన వైపునే కుర్రాడిని తీసుకుని పోలీసులు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో తన మనవడిని వెతుక్కుంటూ ఓ వృద్ధురాలు రావడం చూసిన పోలీసులు ఆమెకు చిన్నారిని చూపించగా..ఆమె తన మనవడే అని తెలిపింది. ఆ చిన్నారిని ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. -
మూడుచక్రాల కారుతో.. అదరగొట్టిన బుడ్డోడు!
చిన్నతనంలో మీరు మూడు చక్రాల కారు నడిపించారా? మామూలుగా అయితే ఇంట్లో.. మహా అయితే మీ సందులో ఎవరైనా పెద్దవాళ్లతో కలిసి మాత్రమే వెళ్లి ఉంటారు కదూ. కానీ, చైనాలో ఈ బుడ్డోడు మాత్రం అక్కడి కార్ల వాళ్లతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కూడా చుక్కలు చూపించాడు. తన బొమ్మకారు తీసుకుని ఏకంగా మెయిన్ రోడ్డులోకి వెళ్లిపోయి.. మంచి బిజీగా ఉన్న రోడ్డులో పెద్దపెద్ద వాహనాల మధ్య నుంచి దూరి మరీ వెళ్లిపోయాడు. ఎదురుగుండా కార్లు వస్తున్నా, బస్సులు వస్తున్నా కూడా ఏమాత్రం భయం లేకుండా చకచకా తన మూడు చక్రాల కారు తీసుకుని రయ్యిమంటూ వెళ్లిపోయాడు. చైనాలోని ఝెజియాంగ్ రాష్ట్రంలోగల లిషుయి నగరంలో ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలుగుతుండటంతో ఏంటా అని వచ్చి చూసిన పోలీసు.. ఈ బుడ్డోడిని చూసి కాసేపు ఆశ్చర్యపోయాడు. కాసేపు వాడితో కబుర్లు చెప్పి, నెమ్మదిగా వాడిని ఎత్తుకుని.. వాడి బొమ్మకారు కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జాగ్రత్తగా వాడి తల్లిదండ్రులకు అప్పగించాడు. చైనా సోషల్ మీడియా అయిన వైబోలో ఈ వీడియో చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వేలెడంత లేడు గానీ.. ఎంత పని చేశాడని ఆశ్చర్యపోతున్నారు. దాని మీద రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. కొంతమంది ట్రాఫిక్ పోలీసును మెచ్చుకుంటే.. మరికొందరు నిర్లక్ష్యంగా పిల్లవాడిని వదిలేసిన తల్లిని తిట్టారు. మరికొందరైతే.. చాలామంది డ్రైవర్లు ఆ పిల్లాడిని చూసినా, వాడిని రక్షిద్దామని మాత్రం ఎవరికీ అనిపించలేదా అంటూ సామాజిక స్పృహను ప్రశ్నించారు. -
మూడుచక్రాల కారుతో.. అదరగొట్టిన బుడ్డోడు!