సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ | Border inspector Indian Police Medal | Sakshi
Sakshi News home page

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

Jan 26 2014 3:41 AM | Updated on Oct 20 2018 6:17 PM

నెల్లూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఇన్‌స్పెక్టర్ పి.వీరాంజనేయరెడ్డికి ప్రభుత్వం శనివారం ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది.

నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: నెల్లూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఇన్‌స్పెక్టర్ పి.వీరాంజనేయరెడ్డికి ప్రభుత్వం శనివారం ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) ప్రకటించింది. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన వీరాంజనేయరెడ్డి 1989లో పోలీస్‌శాఖలో ఎస్‌ఐగా ప్రవేశించారు. అనంతరం జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది అవినీతి నిరోధకశాఖలో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి అవినీతిపరుల భరతం పట్టారు. 2007లో నగర సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరులో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్రవేశారు. పలు కీలక కేసులను ఛేదించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
 
 2011లో సీసీఎస్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నాబార్డు నిధులు రూ.1.10 కోట్లు దిగమింగిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ధర్మాన గోపాల్‌ను అరెస్ట్ చేసి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీలను దొంగలించి వాటి విడిభాగాలను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గతేడాది జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన అంతర్‌రాష్ట్ర గజదొంగైనగుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వెంకన్న, అతని సహచరుడ్ని పట్టుకుని సుమారు రూ. 70 లక్షల చోరీసొత్తును రికవరీ చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.

ఆయన సేవలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఇండియన్ పోలీసు మెడల్ అవార్డు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15న హైదరాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వీరాంజనేయరెడ్డి ముఖ్యమంత్రి చేతులమీదుగా మెడల్‌ను అందుకోనున్నారు. ఇదిలా ఉంటే వీరాంజనేయరెడ్డికి 1993 ప్రైమ్‌మినిస్టర్ పోలీసుమెడల్, 2005లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌గా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. తాజాగా ఇండియన్ పోలీసు మెడల్ అవార్డుకు ఎంపిక కావడంతో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, ఏఎస్పీలు రెడ్డి గంగాధర్‌రావు, ఐఆర్‌ఎస్‌మూర్తి, నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, పురప్రముఖులు అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement