నేటినుంచి పుస్తకాల పండగ | book festival in viayawada | Sakshi
Sakshi News home page

నేటినుంచి పుస్తకాల పండగ

Jan 1 2014 2:41 AM | Updated on Aug 13 2018 7:57 PM

ఏడాది గిర్రున తిరిగి వచ్చేసింది. నూతన సంవత్సరంతో పాటు పుస్తకాల పండగ కూడా సాహితీ అభిమానుల ముంగిటకు అరుదెంచింది. అనేక సాహిత్యాంశాలతో కూడిన పుస్తకాలన్నీ ఒకేచోట కొలువై ఉండే అరుదైన ఘట్టం మరోసారి మన ముందుకొచ్చింది

 విజయవాడ, న్యూస్‌లైన్ :
 ఏడాది గిర్రున తిరిగి వచ్చేసింది. నూతన సంవత్సరంతో పాటు పుస్తకాల పండగ కూడా సాహితీ అభిమానుల ముంగిటకు అరుదెంచింది. అనేక సాహిత్యాంశాలతో కూడిన పుస్తకాలన్నీ ఒకేచోట కొలువై ఉండే అరుదైన ఘట్టం మరోసారి మన ముందుకొచ్చింది.  విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచే పుస్తకాల పండగ స్వరాజ్య మైదానంలో బుధవారం ప్రారంభం కానుంది. పుస్తక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు డీ అశోక్‌కుమార్, రావిక్రింది రామస్వామి ఈ వివరాలు వెల్లడించారు. గడిచిన 24 సంవత్సరాలుగా పుస్తక మహోత్సవాలను ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, నగర ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ప్రఖ్యాత ప్రచురణకర్త సీకే నారాయణరెడ్డి పేరును, ప్రధాన వేదికకు సుప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ పేరును పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది పలు ప్రచురణా సంస్థలు తమ పుస్తకావిష్కరణలను పుస్తక మహోత్సవ ప్రాంగణంలో జరుపుకోనున్నాయని వివరించారు.
 
 299 స్టాల్స్ ఏర్పాటు...
 గత ఏడాది 258 స్టాల్స్ ఏర్పాటు చేయగా ఈ ఏడాది దానిని 299కు పెంచినట్లు వారు చెప్పారు. ఈ ఏడాది ప్రధానంగా మళయాళ మనోరమ వంటి దిన, వారపత్రికలు, తెలుగు అకాడమీ, నేషనల్ బుక్‌ట్రస్ట్, సాహిత్య అకాడమీ వంటి ప్రభుత్వ సంస్థలు, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, పీఆర్‌సన్ తదితర బహుళ జాతీయ సంస్థలు పాల్గొనున్నాయని వివరించారు.
 
 ముఖ్యాంశంగా ‘బాల సాహిత్యం’...
 ఈ ఏడాది పుస్తక మహోత్సవం ప్రత్యేక ముఖ్యాంశంగా బాల సాహిత్యాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ సహాయంతో నాలుగు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాహిత్య అకాడమీ ‘పిల్లల కోసం రాయటం’ అనే అంశంపై కన్నడ, తెలుగు రచయితల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
 
 శత జయంతులు...
 2014 సంవత్సరంలో శత జయంతులు వచ్చే రచయితలు జీవీ కృష్ణారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, శంకరంబాడి సుందరాచారి, కాళోజీ, కోదాటి నారాయణరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, సంజీవ్‌దేవ్‌ల శతజయంతి సభలు జరుగుతాయన్నారు. ఆయా సభలకు ప్రముఖ రచయితలు, వారితో అనుబంధం ఉన్న ప్రముఖులు అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు.
 
 విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు...
 విద్యార్థుల కోసం పతిభ వేదిక ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పలు పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈ వేదికకు మన సాహిత్యంపై పిల్లలకు ఇష్టమయ్యే రీతిలో సచిత్రంగా శ్రీకారం చుట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను తీసుకొచ్చిన అమరచిత్రకథ వ్యవస్థాపకుడు అనంత్‌పాయ్ పేరు పెట్టారని వివరించారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రముఖులు కే రవి,  వీజీఎస్ రామారావు, నవోదయ రామ్మోహనరావు, బీ బాబ్జి, బీ రవికుమార్, జే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement