ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు!

Bogus survey teams across the AP State - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తున్న బోగస్‌ సర్వే బృందాలు 

పట్టుబడ్డ బృందాల వద్ద టీడీపీ గుర్తింపు కార్డులు లభ్యం

సర్వే ముసుగులో టీడీపీ టీమ్‌ల అరాచకాలు

70 నుంచి 90 మందితో ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్ల జల్లెడ

విపక్షం మద్దతుదారులున్న చోట్ల ప్రత్యేకంగా సంచారం

వ్యక్తిగత వివరాలు ఆరా తీస్తూ ఓటర్ల ఆంతర్యాన్ని పసిగట్టే యత్నం

ఓటరు కార్డు తదితర వివరాలు ట్యాబ్‌ల్లో నమోదు 

ప్రతి నియోజకవర్గంలోనూ వేలాదిగా ఓట్ల తొలగింపు

సర్వే బృందాలకు అధికారపార్టీ నేతల నేతృత్వం

పట్టుబడ్డా కేసులు లేకుండా పోలీసుల సహకారం

పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న స్పందించని అధికారులు

ఓట్ల దొంగలను వదిలేసి స్థానికులు, విపక్ష నేతలపై అక్రమ కేసులు

సాక్షి, అమరావతి: ఒకవైపు విపక్షం సానుభూతిపరుల ఓట్ల తొలగింపు... మరోవైపు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు! కీలకమైన ఎన్నికలకు ముందు రెండు లక్ష్యాలే పరమావధిగా అధికార పార్టీ పన్నుతున్న కుయుక్తులపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు, జాతకాలు నిర్ణయమవుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న నకిలీ సర్వేలు, ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఓటమి భయంతో అధికార టీడీపీ దొంగ ఓట్లను నమోదు చేయించడంతోపాటు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగింపచేస్తోంది. సర్వేల పేరుతో టీడీపీ బృందాలను నియోజకవర్గాల వారీగా తిప్పుతూ అడ్డగోలుగా అరాచకాలు సాగిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్పించడంతో పాటు పెద్ద ఎత్తున విపక్షం సానుభూతిపరుల ఓట్లను ఏరివేస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

నకిలీ సర్వే బృందాలను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తున్నా ఫలితం ఉండటం లేదని పేర్కొంటున్నారు. సర్వేల పేరిట ఓట్లను తొలగిస్తున్న వారిని ఉపేక్షిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఇతర అధికారుల తీరు కూడా అలాగే ఉంటోంది. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సర్వే పేరిట ఓట్లు తొలగిస్తున్న వారిని అడ్డుకున్నందుకు పోలీసులు అర్థరాత్రి దౌర్జన్యంగా గ్రామస్థుల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేయడం తెలిసిందే. గ్రామస్థులకు అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని రెండు రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో కూడా నకిలీ సర్వే బృందాలను పట్టించిన వైఎస్సార్‌ సీపీ నేతలు మజ్జి శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా నిర్భంధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 

లక్ష్యం సర్వే కాదు.. ఓట్ల తొలగింపే
ఎన్నికల సర్వే పేరిట నకిలీ బృందాలు సాగిస్తున్న వ్యవహారాలను గమనిస్తే వీటి లక్ష్యం సర్వే కాదని వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా చేయడం, నకిలీ ఓట్లను నమోదు చేయడమేనని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని పలు సర్వేల్లో తేటతెల్లం కావడంతో అధికార పార్టీనే ఇలాంటి చర్యలకు దిగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 70 నుంచి 90 మంది యువకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆజమాయిషీకి ఓ సూపర్‌వైజర్‌ను నియమించి రంగంలోకి దించుతున్నారు. ఓట్ల దొంగల ముఠా సభ్యుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోతో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు బయటపడుతుండటం గమనార్హం.

ఆరా తీసి వివరాలు ట్యాబ్‌ల్లో నమోదు..
‘మీకు వైఎస్సార్‌ సీపీ అంటే ఇష్టమా?.. తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమా?.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తారా?... చంద్రబాబును అభిమానిస్తారా? .. ప్రభుత్వం పథకాలు ఎలా అమలవుతున్నాయి?... చంద్రబాబు బాగా పనిచేస్తున్నారా?.. వైఎస్‌ జగన్, చంద్రబాబులలో ఎవరంటే మీకు ఇష్టం?.., ఈ ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?... అంటూ నకిలీ బృందాలు ఆరా తీస్తూ ఓటర్ల మనోగతాన్ని పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలను తమతోపాటు తెచ్చుకుంటున్న ఈ బృందాల్లోని యువకులు వీధి వాడా చుట్టుముడుతున్నారు. ఎక్కువగా వైఎస్సార్‌ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సర్వే పేరిట ఈ నకిలీ బృందాలు సంచరిస్తున్నాయి. అభిప్రాయాలు తెలుసుకొనే నెపంతో ప్రశ్నలు అడుగుతూ చివర్లో  ఓటరు ఐడీ నెంబర్, మొబైల్‌ నెంబర్‌ను సేకరిస్తున్నారు. ఆ వివరాలను తమ వద్ద ఉన్న ట్యాబ్‌లలో పొందుపరుస్తున్నారు. ఈ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న వారిని ట్యాబ్‌లో వారికి నచ్చిన పార్టీ గుర్తుపై నొక్కాలని సూచిస్తున్నారు. తదుపరి ఆ ఓటరు ఓటు కాస్తా రద్దు అవుతోంది. ఓటు రద్దైనట్లు వచ్చిన సమాచారాన్ని తెలుసుకుని సర్వేలో పాల్గొన్న ఓటర్లు నివ్వెరపోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్నాయి. 

ఆన్‌లైన్లో డిలిషన్‌ దాఖలు చేస్తున్న సర్వే బృందాలు
వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు, అభిమానుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నకిలీ సర్వే బృందాలు ఆన్‌లైన్‌లో ఓటు తొలగింపు పత్రం (ఫారం–7) దాఖలు చేస్తున్నాయి. చాలా రోజులుగా ఈ పత్రాల ఆధారంగా ఎలాంటి నోటీసులు, పరిశీలన చేయకుండానే క్షేత్రస్థాయి అధికారులు ఓట్లను రద్దు చేస్తున్నారు. అధికారులు, బీఎల్‌ఓలపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చి విపక్షం సానుభూతిపరుల ఓట్లను రద్దు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణం, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో ఇలా భారీగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి. ఇలా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదును ఓ ప్రణాళిక ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోందన్న ఆరోపణలకు పలు ఉదంతాలు బలం చేకూరుస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా చాపకింద నీరులా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామస్థులు పట్టుకున్న నకిలీ సర్వే బృందాలపై ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్‌ సీపీ నేతలపైనే ఎదురు కేసులు బనాయిస్తూ వేధింపులు కొనసాగిస్తున్నారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల్లో నకిలీ బృందాలను గ్రామస్థులు, వైఎస్సార్‌ సీపీ నేతలు పట్టించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు నకిలీ బృందాలపై ఎక్కడా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

టీడీపీ కేంద్ర కార్యాలయమే అడ్డా...
‘సెంటర్‌ ఫర్‌ సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌ (స్పా)’ అనే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పని చేస్తోంది. ప్రతి బృందానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు నేతృత్వం వహిస్తున్నారు. ప్రతి గ్రూప్‌ కోసం వాట్సప్‌ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి మొబైళ్లు, ట్యాబ్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను టీడీపీ కేంద్ర కార్యాలయమే సమకూర్చిందని చెబుతున్నారు. ‘యువనేత’ ఈ సర్వే వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయినుంచి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నకిలీ బృందాలపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. అడ్డగోలుగా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదు అంశాలను వైఎస్సార్‌ సీపీ నేతలు జిల్లా అధికారుల దృష్టికి తెస్తున్నా స్పందించడం లేదు. 

ఎన్నికల సంఘం నుంచి వచ్చామంటూ...
మరోవైపు ఏకంగా ఎన్నికల సంఘం పేరిట మరికొన్ని బృందాలు  నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కోసం వచ్చామంటూ ఓటర్ల వివరాలు తీసుకొని చివర్లో ఏ పార్టీ అంటే అభిమానం? ఎవరికి ఓటు వేస్తారంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఓటరు ఆంతర్యాన్ని పసిగట్టే యత్నం చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సర్వేల పేరిట ఓట్లను ఏరివేస్తున్న ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నిపుణులు, నేతలు కోరుతున్నారు. ఇలాంటి నకిలీ బృందాలకు వివరాలు చెప్పవద్దని, ఓటరు ఐడీ, ఫోన్‌ నెంబర్లను అసలు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే నిలదీయడంతోపాటు పోలీసులకు అప్పగించి కేసు నమోదు కోసం ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఓ వ్యక్తి ఓటు హక్కును అతడికి తెలియకుండా అక్రమమార్గంలో తొలగించడం ఎన్నికల సంఘం నిబంధనావళి ప్రకారం నేరమని పేర్కొంటున్నారు. నకిలీ సర్వే బృందాల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈసీకి ఫిర్యాదు చేసినా ఆగని అక్రమాలు
రాష్ట్రంలో దాదాపు 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు నెలల క్రితమే ఫిర్యాదులందాయి. వైఎస్సార్‌ సీపీ సాక్ష్యాధారాలతో ఈమేరకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 3.51 కోట్లుండగా తాజాగా జనవరి 11వ తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి  పెరిగింది. అంటే సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 18 లక్షల వరకు ఓట్లు పెరిగాయి. నిజంగానే నకిలీ ఓట్లను తొలగించి ఉంటే మొత్తం ఓట్ల సంఖ్య తగ్గాలి. కానీ ఓటర్ల సంఖ్య గతంలో కన్నా భారీగా పెరిగింది. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కొత్తగా చేరిన ఓటర్లతోపాటు నకిలీ ఓట్లూ కోకొల్లలుగా ఉన్నాయని బోధపడుతోంది. 

సవరించిన జాబితాలోనూ అదే తీరు..
కొత్తగా నమోదైన ఓట్లలో దాదాపు 6 లక్షల వరకు నకిలీ ఓట్లు ఉన్నాయని ‘ఓటర్‌ అనలటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌ (వాస్ట్‌) సంస్థ పేర్కొంది. నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం 59,18,631కి చేరిందని ఆ సంస్థ తెలిపింది. గతంలో నకిలీ ఓట్లుగా గుర్తించినవి సైతం తాజా జాబితాలోనూ కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా సెప్టెంబర్‌ జాబితాలో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఈసారి వేరే నియోజకవర్గంలో కూడా ఓట్లు నమోదు అయ్యాయి. ఒకే బూత్‌లో ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్న వారూ ఈ కొత్త జాబితాలో దర్శనమిస్తుండడం విశేషం. 100 ఏళ్లకు పైబడి 351 ఏళ్ల వయసున్న వారి పేర్లు కూడా సవరించిన తాజా జాబితాలోనూ కొనసాగుతున్నాయి. ఇలాంటి ఓటర్లు 3307 మంది యధాతథంగా కొనసాగుతున్నారు. అలాగే చనిపోయిన వారి పేరిట కొనసాగుతున్న ఓట్లు లక్షకు పైగానే ఉన్నాయని గత సెప్టెంబర్‌ నివేదికలో తేలింది. అవే ఓట్లు ఈసారీ కొనసాగుతున్నాయి. 

నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు
ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఈ నకిలీ ఓట్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, ఎన్నికలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 5 లక్షల ఓట్లేనని, ఈ నేపథ్యంలో ఈసారి అంతకు పదింతలుగా అరకోటికి పైనే నకిలీ ఓట్లు  కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.

ఓటరు కార్డు ఉండగానే సరిపోదు...
సర్వేల పేరిట నకిలీ బృందాలు ఓట్లను తొలగింపచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటరు ఐడీ కార్డు ఉందిలే అనుకుంటే సరిపోదని, అది ఉన్నంతమాత్రాన ఓటు ఉన్నట్లు కాదని పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ జాబితాలో పేరు లేకపోతే ఓటరు ఐడీ కార్డున్నా ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా కూడా వెబ్‌సైట్లో అందుబాటులో ఉందని, తమ ఓటు ఆ జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు లేనట్లుగా గుర్తిస్తే వెంటనే మళ్లీ ఫారం–6 ద్వారా సంబంధిత కార్యాలయంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచన చేస్తున్నారు. ఆన్‌లైన్లో కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. ‘సీఈఓఏఎన్‌డీహెచ్‌ఆర్‌ఏ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’లో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇంటి చిరునామా పత్రంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన వ్యక్తిగత గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఆధారంగా చూపిస్తే సరిపోతుందని, ఆధార్‌ తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం ఇదివరకే స్పష్టం చేసిందని వివరిస్తున్నారు. 

భారీగా బోగస్‌ ఓట్లు నమోదు..
సాక్షి నెట్‌వర్క్‌: కర్నూలు జిల్లాలో బోగస్‌ సర్వేలు నిర్వహించి వైఎస్సార్‌సీపీకి పట్టున్న ప్రాంతాల్లో దాదాపు 35 వేలకు పైగా ఓట్లను తొలగించారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా బోగస్‌ ఓటర్లను నమోదు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఓటరు నమోదు కోసం 1.50 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందినవే లక్ష వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు, డోన్, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, నంద్యాల ప్రాంతాల్లో ప్రత్యేక కంప్యూటర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకుని దరఖాస్తులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిపై రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరుపుతున్నారనే విమర్శలున్నాయి.

కృష్ణాలో లక్షన్నరకు పైగా నకిలీ, డూప్లికేట్‌ ఓట్లు..
కృష్ణా జిల్లాలో 2014 నాటికి 33,37,071 మంది ఓటర్లు ఉండగా 2018 ఓటర్ల ముసాయి జాబితా సిద్ధమయ్యే నాటికి అందులో 2,85,949 మంది ఓట్లు గల్లంతయ్యాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు ఈ ఓట్లను గల్లంతు చేశారని ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల మళ్లీ 2,25,669 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 33,03,592 చేరింది. ఇందులో 1.50 లక్షలకుపైగా నకిలీ, డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు.

తణుకులో బెడిసికొట్టిన పథకం..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులైన సుమారు 2,000 మంది ఓట్లను తొలగించేందుకు అధికార పక్షం వేసిన పథకం బెడిసికొట్టింది. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా తణుకు నియోజవర్గంలోని వివిధ పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సుమారు 2 వేల ఓట్లను తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ల పేరుతో కొందరు నకిలీ వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. సోమవారం సంబంధిత వీఆర్‌వోలు విచారణ నిమిత్తం ఓటరు ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇరగవరం మండలంలోని పొదలాడ, ఇరగవరం, కంతేరు, తదితర గ్రామాలతో పాటు తణుకు మండలంలోని తేతలి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లను తొలగించాలని నకిలీ వ్యక్తులు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఏ ఒక్క ఓటరు వివరణ తీసుకోకుండా ఓటును తొలగించబోమని తహసిల్దార్‌ శివకుమార్‌ హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top