డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం | Body of missing doctor kosaraju jayachandra found in canal | Sakshi
Sakshi News home page

డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం

Oct 28 2014 8:48 AM | Updated on Apr 3 2019 5:34 PM

డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం - Sakshi

డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం

దీపావళి పండుగ సందర్భంగా పది రోజుల క్రితం కారులో తెనాలి వెళ్లిన జూనియర్ డాక్టర్ కొసరాజు జయచంద్ర ఆచూకీ లభ్యమైంది.

గుంటూరు :  పది రోజుల క్రితం అదృశ్యమైన జూనియర్ డాక్టర్ కొసరాజు జయచంద్ర ఉదంతం విషాదాంతమైంది.  గుంటూరు జిల్లా కృష్ణా పశ్చిమ డెల్టా  కాలువ సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. నిన్న కారును వెలికి తీసిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది. కాగా జయచంద్రన్కు భార్యా, ఏడాది బాబు ఉన్నారు.

జయచంద్ర ప్రయాణించిన కారు కృష్ణా,పశ్చిమ ప్రధాన కాలువలో దుగ్గిరాల కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ (సీసీఎల్) సమీపంలో నిన్న దొరికిన విషయం తెలిసిందే. కాలువ ఒడ్డుకు సుమారు 25 అడుగుల లోపల ఓ నీలం రంగు కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.   పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.

కాగా కారు దొరికిన ప్రదేశానికి అర కిలోమీటరు దూరంలో ప్రమాదవశాత్తు కారు కాల్వలో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తెనాలి-విజయవాడ రహదారి వెంబడి ఉన్న ఆర్అండ్బీ శాఖ ఏర్పాటు చేసిన రాయి ఒకటి విరిగి కాల్వలో పడి వుంది. కాల్వలో నీరు తగ్గడంతో రాయి సోమవారం బయట పడింది. అక్కడ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

తెనాలికి చెందిన జయచంద్ర సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డీఎం ఫైనల్ ఇయర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనెల 17వ తేదీ వరకు గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాజీ విభాగంలో విధులు నిర్వహించాడు. దీపావళికి ఇంటికి వెళ్లేందుకు 18వ తేదీన ఇద్దరు మిత్రులతో కలిసి తన కారు (ఏపీ 07 బీఆర్ 9016)లో తెనాలి బయలు దేరాడు. సూర్యపేటలో ముగ్గురూ కూల్ డ్రింక్స్ తాగారు.

అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాక ఇంటికి ఫోన్ చేశాడు. స్నేహితులను బస్టాండ్ వద్ద దింపాడు. తానే స్వయంగా కారు నడుపుకుంటూ అక్కడి నుంచి తెనాలికి బయలుదేరాడు. మరో గంటలో ఇంటికి వస్తానని ఫోన్ చేసి చెప్పిన జయచంద్రన్ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. మరుసటి రోజు రాత్రి వరకు అతను రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెనాలి టూ టౌన్, విజయవాడ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement