రాజధానికి నీరెలా? | Blueprint for making the irrigation department, the command | Sakshi
Sakshi News home page

రాజధానికి నీరెలా?

Nov 11 2014 12:11 AM | Updated on Aug 24 2018 2:33 PM

రాజధానికి నీరెలా? - Sakshi

రాజధానికి నీరెలా?

రాష్ట్ర రాజధాని జోన్‌గా సర్కారు ప్రకటించిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ప్రస్తుత, భవిష్యత్తు జనావాసాలకు తాగునీరు...

  • బ్లూప్రింట్ తయారీకి నీటి పారుదల శాఖకు ఆదేశం
  •  ఢిల్లీ, నయా రాయ్‌పూర్, గాంధీనగర్‌లలో అధ్యయనానికి అధికారుల యోచన
  •  నీటి నిల్వల ప్రదేశాలు, సరఫరా అంశాలపై సర్వే షురూ: ఎస్‌ఈ
  •  కృష్ణా నదిపై పులిచింతలలో 45 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యం
  •  ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3 టీఎంసీలకు అవకాశం
  •  ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదిలో పూడిక తీస్తే మరో 4 టీఎంసీల నిల్వకు చాన్స్
  •  ఐదేళ్లలో పులిచింతల నుంచి పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసేలా ప్రణాళిక
  • సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్‌గా సర్కారు ప్రకటించిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ప్రస్తుత, భవిష్యత్తు జనావాసాలకు తాగునీరు, వాణిజ్య, భవన నిర్మాణ అవసరాలకు నీటిని ఏ విధంగా సరఫరా చేయాలనేది అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో.. రాజధాని జోన్‌లో తాగునీటి సరఫరాను నివాస, వాణిజ్య విభాగాలుగా విభజించి ఐదేళ్ల తర్వాత నుంచి ఎంత మేరకు నీరు అవసరమవుతుంది? దీన్ని ఎలా సరఫరా చేయాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు.

    త్వరలోనే న్యూఢిల్లీ, నయారాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), గాంధీనగర్ (గుజరాత్)లతో పాటు అవవసరమైతే సింగపూర్‌లోనూ పర్యటించి అక్కడి నీటి సరఫరా విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఎకరాలకు పైగా భూములను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలి విడతగా 30 వేల ఎకరాల వ్యవసాయ భూముల సమీకరణకు రంగంలోకి దిగింది.

    ఈ నేపథ్యంలోనే రాజధాని జోన్‌లో ఏర్పడబోయే సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఇప్పటికే ఉన్న గ్రామాలు, కొత్తగా ఏర్పడబోయే ఆవాస ప్రాంతాలకు నీటిని ఎలా సరఫరా చేయొచ్చో ప్రాథమిక ప్రణాళిక తయారుచేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది.
     
    కృష్ణాలో 50టీఎంసీల నిల్వకు అవకాశం

    పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ అప్పర్ స్ట్రీమ్‌లో (ఎగువ భాగాన) కృష్ణా నదికి రెండు వైపులా 20 కిలోమీటర్ల దూరం దాకా రివిట్‌మెంట్ వాల్ పటిష్టంగా నిర్మించి నదిలో 30 అడుగుల మేర పూడిక తొలగిస్తే అదనంగా మరో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సుమారు 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని లెక్క కడుతున్నారు.
     
    ప్రకాశం ఎగువున మరో బ్యారేజీ

    కృష్ణా నది మీద మరో రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించి 6 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దిశగా ఇంజనీరింగ్ నిపుణులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం - తాళ్లాయపాలెం మధ్యలో నది మీద బ్రిడ్జి నిర్మించడం ద్వారా 9వ నంబరు జాతీయ రహదారి, 5వ నంబరు జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రణాళిక తయారు చేశారు. దీన్ని బ్రిడ్జి కం బ్యారేజీగా నిర్మిస్తే ఇక్కడ 3 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చనే దిశగా కూడా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు.
     
    ‘పులిచింతల’ పునరావాసం పూర్తి చేస్తేనే...

    పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలోని నాలుగు ముంపు గ్రామాలకు పునరావాస కార్యక్రమం పూర్తి చేస్తేనే ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలు కలుగుతుంది. ఈ పని పూర్తి చేయకపోతే ఆ గ్రామాలు మునిగిపోయి పొరుగు రాష్ట్రం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవల పులిచింతల నీటి నిల్వల సందర్భంగా ఎదురైన అనుభవంతో పునరావాస పనులు యుద్ధప్రాతిపదిక పూర్తిచేయడం మంచిదని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు.

    ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంలో నీరు నిల్వ చేస్తే ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా రాజధాని జోన్‌లో నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేయొచ్చని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఒక రూపానికి వ చ్చేప్పటికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందనే అంచనాతో అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా జరిపేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.  
     
    నీటి నిల్వ, సరఫరాలపై సర్వే చేస్తున్నాం: ఎస్‌ఈ

    ‘‘రాజధాని జోన్‌కు అవసరమయ్యే నీటిని ఎక్కడెక్కడ ఏ మేరకు నిల్వ చేయవచ్చు, వాటిని ఏ విధంగా సరఫరా చేయొచ్చు అనే విషయం మీద సర్వే జరుపుతున్నాం. నిపుణుల కమిటీ ఆదేశం మేరకు ఈ పని ప్రారంభించాం. త్వరలోనే ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం’’ అని నీటి పారుదల శాఖ కృష్ణా డెల్టా ఎస్‌ఈ  కె.శ్రీనివాస్ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement