breaking news
Pulicintala project
-
రాజధానికి నీరెలా?
-
రాజధానికి నీరెలా?
బ్లూప్రింట్ తయారీకి నీటి పారుదల శాఖకు ఆదేశం ఢిల్లీ, నయా రాయ్‌పూర్, గాంధీనగర్‌లలో అధ్యయనానికి అధికారుల యోచన నీటి నిల్వల ప్రదేశాలు, సరఫరా అంశాలపై సర్వే షురూ: ఎస్ఈ కృష్ణా నదిపై పులిచింతలలో 45 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యం ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3 టీఎంసీలకు అవకాశం ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదిలో పూడిక తీస్తే మరో 4 టీఎంసీల నిల్వకు చాన్స్ ఐదేళ్లలో పులిచింతల నుంచి పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసేలా ప్రణాళిక సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్‌గా సర్కారు ప్రకటించిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల పరిధిలో ప్రస్తుత, భవిష్యత్తు జనావాసాలకు తాగునీరు, వాణిజ్య, భవన నిర్మాణ అవసరాలకు నీటిని ఏ విధంగా సరఫరా చేయాలనేది అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో.. రాజధాని జోన్లో తాగునీటి సరఫరాను నివాస, వాణిజ్య విభాగాలుగా విభజించి ఐదేళ్ల తర్వాత నుంచి ఎంత మేరకు నీరు అవసరమవుతుంది? దీన్ని ఎలా సరఫరా చేయాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు. త్వరలోనే న్యూఢిల్లీ, నయారాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), గాంధీనగర్ (గుజరాత్)లతో పాటు అవవసరమైతే సింగపూర్‌లోనూ పర్యటించి అక్కడి నీటి సరఫరా విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన 40 వేల ఎకరాలకు పైగా భూములను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలి విడతగా 30 వేల ఎకరాల వ్యవసాయ భూముల సమీకరణకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే రాజధాని జోన్లో ఏర్పడబోయే సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఇప్పటికే ఉన్న గ్రామాలు, కొత్తగా ఏర్పడబోయే ఆవాస ప్రాంతాలకు నీటిని ఎలా సరఫరా చేయొచ్చో ప్రాథమిక ప్రణాళిక తయారుచేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది. కృష్ణాలో 50టీఎంసీల నిల్వకు అవకాశం పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ అప్పర్ స్ట్రీమ్‌లో (ఎగువ భాగాన) కృష్ణా నదికి రెండు వైపులా 20 కిలోమీటర్ల దూరం దాకా రివిట్మెంట్ వాల్ పటిష్టంగా నిర్మించి నదిలో 30 అడుగుల మేర పూడిక తొలగిస్తే అదనంగా మరో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సుమారు 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని లెక్క కడుతున్నారు. ప్రకాశం ఎగువున మరో బ్యారేజీ కృష్ణా నది మీద మరో రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించి 6 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే దిశగా ఇంజనీరింగ్ నిపుణులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం - తాళ్లాయపాలెం మధ్యలో నది మీద బ్రిడ్జి నిర్మించడం ద్వారా 9వ నంబరు జాతీయ రహదారి, 5వ నంబరు జాతీయ రహదారిని అనుసంధానం చేసే ప్రణాళిక తయారు చేశారు. దీన్ని బ్రిడ్జి కం బ్యారేజీగా నిర్మిస్తే ఇక్కడ 3 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చనే దిశగా కూడా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ‘పులిచింతల’ పునరావాసం పూర్తి చేస్తేనే... పులిచింతల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలోని నాలుగు ముంపు గ్రామాలకు పునరావాస కార్యక్రమం పూర్తి చేస్తేనే ప్రాజెక్టులో 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలు కలుగుతుంది. ఈ పని పూర్తి చేయకపోతే ఆ గ్రామాలు మునిగిపోయి పొరుగు రాష్ట్రం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవల పులిచింతల నీటి నిల్వల సందర్భంగా ఎదురైన అనుభవంతో పునరావాస పనులు యుద్ధప్రాతిపదిక పూర్తిచేయడం మంచిదని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంలో నీరు నిల్వ చేస్తే ఇక్కడి నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా రాజధాని జోన్లో నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేయొచ్చని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఒక రూపానికి వ చ్చేప్పటికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుందనే అంచనాతో అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా జరిపేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య శాఖలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. నీటి నిల్వ, సరఫరాలపై సర్వే చేస్తున్నాం: ఎస్ఈ ‘‘రాజధాని జోన్‌కు అవసరమయ్యే నీటిని ఎక్కడెక్కడ ఏ మేరకు నిల్వ చేయవచ్చు, వాటిని ఏ విధంగా సరఫరా చేయొచ్చు అనే విషయం మీద సర్వే జరుపుతున్నాం. నిపుణుల కమిటీ ఆదేశం మేరకు ఈ పని ప్రారంభించాం. త్వరలోనే ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం’’ అని నీటి పారుదల శాఖ కృష్ణా డెల్టా ఎస్ఈ కె.శ్రీనివాస్ తెలిపారు. -
పరిహారం వెంటనే చెల్లించండి
ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి పులిచింతల నిర్వాసితుల కోసం రూ.40 కోట్లు విడుదల చేయండి నీటి నిల్వపై సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేనికి హరీశ్ సూచన హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు నష్టపరిహారాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వచేసుకునే విషయంలో సహకరించేందుకు తాము సిద్ధమని.. అయితే ముందుగా నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ. 132 కోట్లలో వెంటనే రూ. 40 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుతో మాట్లాడానని.. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారని హరీశ్ తెలిపారు. కృష్ణానదిపై నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీకి మధ్యలో సుమారు 45 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు కింద 28 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు చెందిన 13 గ్రామాలున్నాయి. అయితే పునరావాస ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. కొద్దిరోజుల కింద పులిచింతలలో 10.8 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో.. నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెలటూరు, కిష్ఠాపురంతో పాటు మరో గ్రామంలోకి నీరు వచ్చి చేరింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించి, ప్రాజెక్టులో 8 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దాంతోపాటు తెలంగాణలోని నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంలో రూ. 20 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని ఏపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం పులిచింతల నిర్వాసిత గ్రామాల్లో పునరావాస చర్యలపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. పరిహారం విడుదలపై సమావేశం నుంచే ఏపీ మంత్రి దేవినేనితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. సహకరించడానికి సిద్ధం.. సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులో ఏపీ నీటిని నిల్వ చేసుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే... ఆ మేరకు నిర్వాసితుల పునరావాసానికి రూ. 132 కోట్లు అవసరం. ఇందులో వెంటనే రూ. 40 కోట్లు విడుదల చేస్తే నాలుగు గ్రామాల పునరావాసం పూర్తవుతుంది..’’ అని చెప్పారు. ఇదే అంశమై ఏపీ మంత్రితో మాట్లాడానని.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల తరలింపునకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేశామని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హరీశ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న క్వార్టర్లలో చాలా వరకు కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయని.. అందులో శాఖకు అవసరమైన వాటిని ఉంచుకొని, మిగతా వాటిని వేలం ద్వారా అమ్మేయాలని నిర్ణయించామని తెలిపారు. కాగా చెరువుల పునరుద్ధరణపై సోమవారం ముఖ్యమంత్రితో చర్చించి, మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు. -
అదనపు నీటి నిల్వ సరికాదు
పులిచింతలపై ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్: గతంలో జరిగిన ఒప్పందాలను విస్మరిస్తూ పులిచింతల ప్రాజెక్టులో అదనపు నీటిని నిల్వ చేస్తూ.. గ్రామాల ముంపునకు కారణమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులో 42.8 మీటర్ల మేర నీటిని నిల్వ చేయడంతో నల్లగొండ జిల్లాలోని నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి ఎలాంటి సహాయ పునరావాసం కల్పించకుండా ఇలా నీటిని నిల్వ చేయడంపై అభ్యం తరం తెలిపింది. తక్షణం నీటి నిల్వను 40 మీటర్లకు తగ్గించాలని కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సమావేశంలో 40 మీటర్ల వరకే ప్రాజెక్టులో నీటిని నింపాలని రెండు రాష్ట్రాల అధికారులు అవగాహనకు వచ్చారు. సాగర్ ఇన్‌ఫ్లో కారణంగా పులిచింతల ప్రాజెక్టులో గత అవగాహనకు భిన్నంగా 42.8 మీటర్ల మేర నీటి నిల్వ ఉం చారు. దీంతో నాలుగు గ్రామాల ను నీరు చుట్టుముట్టింది. ఇక్కడి గ్రామస్థులకు సహాయ పునరావాసం కింద అందాల్సిన రూ.60 కోట్లు ఇవ్వకుండా నిల్వను పెంచడం సరికాదు. తక్షణమే నీటి నిల్వను తగ్గించేలా సంబంధిత అధికారులను ఆదేశించండి’ అని వారు వేర్వేరుగా కోరారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్రావత్కు కూడా తెలంగాణ సీఎస్ లేఖ రాశారు.