రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో శాంతియుతంగా కోరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు
=అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి నిరసన
=దిగ్విజయ్ దిష్టిబొమ్మ దహనం
సిరిపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో శాంతియుతంగా కోరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు పార్టీ నగర విభాగం ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి వద్ద సోమవారం సాయంత్రం మానవహారం చేపట్టారు. టీ బిల్లు ప్రతులను చించి వేసి, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పార్టీ అధికార ప్రతినిధి కంపా హనోక్ మాట్లాడుతూ ఎలాగైనా రాష్ట్రాన్ని విభజించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. విభజన ను అడ్డుకుంటానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలన్నారు.
పార్టీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగుతల్లి విగ్రహం ముందు బైఠాయించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.