కబ్జాల బాట.. కమీషన్ల వేట

Bhuma Akhila Priya Corruption Special Story - Sakshi

ఆళ్లగడ్డలో వసూళ్ల రాజ్యం

నీరు–చెట్టులో పర్సెంటేజీల ప్రవాహం

భూకబ్జాల్లో ‘తమ్ముళ్ల’ బిజీ

మట్టి దందాలో మంత్రి ‘మార్క్‌’

నలిగిపోతున్న అధికారులు

అయినా వదలని అధికార పార్టీ నేతలు

చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా చేపట్టారు.  ఒకవైపు అధికారం..మరోవైపు ‘వారసత్వం’.. ఇక తనకు అడ్డే లేదనుకున్నారు.  ఫ్యాక్షన్‌  గడ్డ ఆళ్లగడ్డను కమీషన్ల అడ్డాగా మార్చేశారు. నీరు–చెట్టు పనుల్లో కమీషన్ల ప్రవాహానికి తెరలేపారు. నగర పంచాయతీలో అడ్డగోలు పనులకు అనుమతిలిచ్చేశారు. ‘అనుంగు’ అధికారుల సాయంతో అక్రమాలకు సైతం జైకొట్టించారు.  ఎర్రమట్టిలోనూ నోట్ల వేట సాగిస్తున్నారు. కబ్జాలకు పచ్చజెండా ఊపి..ప్రభుత్వ భూములు, స్థలాలను అనుయాయుల పరం చేసేస్తున్నారు. అటు అధికారులకు చుక్కలు చూపిస్తూనే..ఇటు  పక్క నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతూ సొంత పార్టీ నేతలకూ ఝలక్‌ ఇస్తున్నారు. సొంత శాఖ ‘పర్యాటకం’లో ఈవెంట్‌ మేనేజర్ల ఆధిపత్యాన్ని ఆహ్వానించి.. రూ.కోట్లతో ‘పండుగలు’ చేసేస్తున్నారు. మొత్తంగా అఖిలప్రియ‘ఇష్టారాజ్యం’పై  సర్వత్రా చర్చ సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, కర్నూలు : భూమా అఖిలప్రియ... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. తల్లి శోభా నాగిరెడ్డి వారసత్వంగా ఎమ్మెల్యే పదవిని, తండ్రి భూమా నాగిరెడ్డి కారణంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే తన ‘మార్కు’ను చూపిస్తున్నారు. ఏకంగా మంత్రి స్టిక్కర్లు ఉన్న వాహనాలతోనే ఎర్రమట్టి దోపిడీకి పాల్పడే స్థాయికి ఎదిగారు.  ఈ విషయంలో మొన్నటి వరకు ‘మామా’ అని పిలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డితోనే వైరానికి దిగారు. పైకి మొండి ఘటంగా కనిపించేందుకు ఎప్పటికప్పుడు రాజకీయ నాటకాలు ఆడటంలోనూ ఆరితేరారన్న ఘనతను సొంతం చేసుకున్నారు. తన అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదా చేశారంటూ గన్‌మెన్లను వెనక్కి పంపడం, చివరకు సీఎం పర్యటనకూ గైర్హాజరు కావడం ‘పొలిటికల్‌ డ్రామా’లో భాగమేనన్న ప్రచారం సాగుతోంది. 

తన భర్త పెత్తనంపై లేవనెత్తిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ఈ విధంగా డొంకతిరుగుడుగా  కార్యకర్తల పేరుతో వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూసి రాజకీయ మేధావులే విస్తుపోతున్నారు. నీరు–చెట్టు పథకంలో పనులు చేయకపోయినా బిల్లులు ఇచ్చేందుకు అనుంగు అధికారిని నియమించుకోవడమే కాకుండా.. తనిఖీలు చేయాలంటే విజిలెన్స్‌ అధికారులు కూడా జంకే పరిస్థితిని కల్పించారు.   పక్క నియోజకవర్గంలో మంత్రి పేరుతో సాగుతున్న ఎర్రమట్టి దందాపై విచారణకు వచ్చిన విజిలెన్స్‌ అధికారులు చివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగారంటే ఆమె జబర్దస్త్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మంత్రి పేరుతో అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలు, నాణ్యతలేని పనులు, దౌర్జన్యాలు కోకొల్లలు.

నీరు–చెట్టు.. కమీషన్లు పట్టు
8ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏకంగా రూ.150 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులు చేపట్టారు. ఈ పనులన్నీ ఓ  బడా కాంట్రాక్టర్‌తో పాటు అధికార పార్టీ నేతలకు అప్పజెప్పారు. ప్రతి పనిలోనూ మంత్రి 20 శాతం మేర కమీషన్‌ తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పినట్టు వినేందుకు ఏకంగా ఒక అధికారిని కూడా నియమించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కేవలం కమీషన్ల రూపంలోనే రూ.30 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాత పనులతో పాటు అసలు పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కూడా కిమ్మనకుండా  బిల్లులు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వారు విచారణ చేయాలని భావించినా.. అధికార అండతో అడ్డుకుంటున్నట్లు వినికిడి.

నీరు–చెట్టు పనులను ప్రధానంగా  మంత్రి మామ, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బీవీ రామిరెడ్డితో పాటు రామ్మోహన్‌ రెడ్డి, ఆళ్లగడ్డ వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, కొండాపురం శివరామిరెడ్డి, పెద్దకంబలూరు సర్పంచ్‌ ఎర్రం ప్రతాపరెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, శేఖర్, చంటి, ముత్తలూరు రామసుబ్బారెడ్డి, రుద్రవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ పత్తి సత్యనారాయణ, చాగలమర్రి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రాంపల్లె రఘునాథరెడ్డి, చక్రాతిపల్లి నరసింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, గొడుగునూరు సర్పంచ్‌  దేశంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, దొర్నిపాడు జెడ్పీటీసీ సభ్యుడు భూమా వీరభద్రారెడ్డి, హరివ రం మహేష్‌రెడ్డి, దొర్నిపాడు సహకార సంఘం చైర్మన్‌ సత్యం తదితరులు చేసినట్లు తెలుస్తోంది.

నాడు గ్రామ కుంట..నేడు ‘తమ్ముడి’ పొలం 
పంటల సాగుకు సిద్ధంగా ఉన్న ఈ పొలం రుద్రవరం మండలం చిత్రేనపల్లిలోనిది. ఏడాది క్రితం వరకు ఇది నీటి కుంట.  గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సర్వేనెంబర్‌ 1160, 1167లోని 10.75 ఎకరాల్లో కుంటను తొలగించారు. ఈ కుంటపై కన్ను పడిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామలింగం సుమారు రూ.50 లక్షల విలువ చేసే దీనిని ఆక్రమించాడు. కట్టను చదును చేసి.. ఇక్కడ రెండు బోర్లు వేయించాడు. డ్రిప్పు ఏర్పాటు చేసుకుని ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాడు.

ఎర్రమట్టిలో దోపిడీ
8మంత్రి అఖిలప్రియ సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డలోనే కాకుండా పక్కనే ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలోనూ వేలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి చెరువు నుంచి ఎర్రమట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. రోజుకు సుమారు వంద టిప్పర్ల ఎర్రమట్టిని ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు రూ. 5 లక్షల చొప్పున ఆదాయం ఉంది. ఈ లెక్కన నెలకు ఏకంగా రూ.కోటిన్నర మేర  ఆర్జిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసినప్పటికీ వెరవకుండా నిరంతరాయంగా వ్యవహారం సాగుతోంది. ఏకంగా మంత్రి పేరిట స్టిక్కర్లు వేసుకుని మరీ దోపిడీ సాగుతోంది. ఎస్కార్టుగా కొద్ది మంది జీపుల్లో ముందు వస్తూ.. వెనుక టిప్పర్లలో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. నంద్యాలలోని ఇటుక బట్టీల్లో డంపు చేస్తున్నారు. కచ్చితంగా తమ వద్దే ఎర్రమట్టిని తీసుకోవాలంటూ ఇటుక బట్టీ దారులను కూడా బెదిరిస్తున్నారు.  శ్రీశైలం ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గమంటూ ఎర్రమట్టిని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో   ఇటుకల తయారీదారులకు ఈ ఇరువురు నేతల అనుచరుల నుంచి తమ మట్టే తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. నంద్యాల చుట్టుపక్కల 400 నుంచి 500 వరకు ఎర్ర ఇటుకల బట్టీలు ఉన్నాయి. వీటి యజమానులు కాస్తా ఇరువురు నేతల అనుచరుల బెదిరింపులకు గురవుతున్నారు.

కలెక్షన్స్‌..కరెప్షన్‌
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.150 కోట్ల నీరు–చెట్టు పనులు జరిగాయి. ఇందులో 20 శాతం.. అంటే రూ.30 కోట్ల మేర మంత్రికి కమీషన్లు అందినట్లు ఆరోపణలున్నాయి.
ఆళ్లగడ్డ నగర పంచాయతీలో నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అధికారులే వసూలు చేసి ‘తమ్ముళ్ల’కు ఇస్తున్నారు.
నగర పంచాయతీ పరిధిలో జరిగిన పనులకు సంబంధించి రూ.20 కోట్ల మేర కమీషన్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
అంకిరెడ్డిపల్లి చెరువు నుంచి ఎర్రమట్టి రూపంలో నెలకు రూ.కోటిన్నర కొల్లగొడుతున్నారు.

కొండను మింగిన ‘తమ్ముడు’ 
చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసిన ఈ పొలం రుద్రవరం మండలం తువ్వపల్లె సమీపంలోనిది. ఇక్కడ సర్వేనెంబర్‌ 534లో 54.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయించింది.  ఆదర్శ పాఠశాల, హాస్టల్, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు కేటాయించడంతో పాటు ప్రభుత్వ గోదాము కూడా ఏర్పాటయ్యింది. దీంతో ఇక్కడ భూమికి ధర అమాంతం పెరిగింది. దీంతో మిగిలిన కొండ భూమిపై రుద్రవరం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రంగయ్య కన్ను పడింది.  వెంటనే తన అనుచరులను తీసుకుని వెళ్లి సుమారు 20 ఎకరాల భూమి చుట్టూ సిమెంటు స్తంభాలతో కంచె ఏర్పాటు చేసి ఆక్రమించారు.  

రహదారినే ఆక్రమించారు
మంత్రి అండదండలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అనుచరులు రెచ్చిపోతున్నారు. చాగలమర్రిలో  ఏకంగా రహదారినే ఆక్రమించే ప్రయత్నం చేశారు. పాత జాతీయ రహదారిలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కు చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. అక్కడ ఏకంగాపర్మినెంటు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు. ఆక్రమణదారులకు మంత్రి అండదండలు ఉండడంతో అధికారులు నోటీసులతో సరిపెట్టుకున్నారు. వ్యాపారానికి అనువైన ప్రాంతంలో ఉన్న ఈ స్థలం సెంటు రూ.లక్షల్లో విలువ చేస్తుంది. అలాంటి పది సెంట్ల  స్థలాన్ని కబ్జా చేస్తున్నట్టు తెలుస్తోంది. పర్మినెంటుగా షాపులను నిర్మిస్తే తొలగించకుండా అడ్డుకునేందుకు కూడా ఉపయోగపడుతుందనేది ఆక్రమణదారుల  ఆలోచనగా ఉంది. మొత్తం మీద మంత్రి అండదండలతో ఆర్‌అండ్‌బీ స్థలంలో షాపులను నిర్మించడమే కాకుండా కరెంటు కనెక్షన్‌ కూడా తీసుకుని అధికార ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, చివరకు అధికారులు రంగంలోకి దిగి నోటీసులు ఇవ్వడంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు.  

భర్త పెత్తనం
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారులు రెండు విధాలుగా ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు మంత్రి.. మరోవైపు ఆమె భర్త పెత్తనంతో నలిగిపోతున్నారు.  పెళ్లి తర్వాత మొత్తం మకాంను ఆళ్లగడ్డకే మంత్రి భర్త మార్చేశారు. నిరంతరం మంత్రితో పాటే తిరుగుతూ అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు మంత్రి ఆదేశాలతో సతమతమవుతున్న అధికారులకు... మరోవైపు మంత్రి భర్త పెత్తనం మరింత తలనొప్పిగా మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆళ్లగడ్డ నగర పంచాయతీలో భర్త పెత్తనంతో అధికారులు సతమతమవుతున్నారు.

ఇక మొదటి నుంచీ ఫ్యాక్షన్‌ నియోజకవర్గంగా ఉన్న ఆళ్లగడ్డలో మంత్రి భర్త వ్యవహారంతో మరింత ముదురుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా చిన్న గొడవ జరిగినా ప్రత్యర్థులను  ఏదో  ఒకటి చేసి రావాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి.. ఇది సరికాదని హెచ్చరిక «ధోరణిలో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అనుచరుల ఇళ్లల్లో దాడులు జరిగాయంటూ మంత్రి ఏకంగా గన్‌మెన్లను వెనక్కి  పంపడమే కాకుండా జిల్లాలో సీఎం పర్యటనకూ గైర్హాజరయ్యారని సమాచారం.

నగర పంచాయతీలో వసూళ్ల పర్వం
ఆళ్లగడ్డ నగర పంచాయతీలో అర్హత లేని అధికారిని మంత్రి నియమించుకున్నారు. తాము చెప్పినట్టు వినాలనే షరతుతో నియమించుకున్న సదరు అధికారి సహకారంతో పాలకవర్గంతో సంబంధం లేకుండానే ఏకపక్షంగా పనులు చేస్తున్నారు.  నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర అధికార పార్టీ నేతలకు అధికారులే వసూలు చేసి ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఇక తన వల్ల కాదంటూ ఒక అధికారి సెలవులో వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితే ఉద్యోగం ఊడుతుందని బెదిరించడంతో సెలవు ప్రయత్నాన్ని విరమించుకుని.. ప్రతి నెలా యథావిధిగా వసూలు చేసి అధికార పార్టీ నేతలకు ముట్టజెబుతున్నారు. నగర పంచాయతీలో జరిగిన రూ.100 కోట్ల విలువైన పనుల్లో కమీషన్‌ రూపంలోనే రూ.20 కోట్ల వరకూ బొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులన్నింటికీ నలుగురు మాత్రమే రింగుగా ఏర్పడి.. అధిక ధరకు టెండర్లు వేశారు. అలాగే ప్రజలకు అవసరమున్న పనులు కాకుండా ఇష్టారీతిన చేపట్టారు. నగర పంచాయతీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లను కూడా ఎటువంటి అద్దె కట్టకుండా అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ  చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top