‘భూ చేతన’తో రైతన్నకు లాభం | benifit of farmers with bhu chethana scheme | Sakshi
Sakshi News home page

‘భూ చేతన’తో రైతన్నకు లాభం

Jan 17 2014 4:14 AM | Updated on Sep 2 2017 2:40 AM

జిల్లాలోని వ్యవసాయ సాగు భూముల్లో సూక్ష్మ ధాతువుల లోపాల్ని భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ భూ చేతన పథకాన్ని అమలు చేస్తోంది.

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని వ్యవసాయ సాగు భూముల్లో సూక్ష్మ ధాతువుల లోపాల్ని భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ భూ చేతన  పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రబీ సీజన్‌నుంచి  పథకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో 20శాతం పంట దిగుబడుల్ని పెంపొందించేందుకు ఈ పథకం దోహదపడుతోందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.

 సూక్ష్మ ధాతువులు సాగు నేలల్లో లోపించటం వల్లనే పంట దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయని ఏటా వేసవిలో సాగు నేలల్లో వ్యవసాయాధికారులు సేకరిస్తున్న మట్టి నమూనాలు చెబుతున్నాయి. అధికారులు గ్రామాల వారీగా సేకరించిన మట్టి నమూనాల్ని ఎప్పటికపుడు హైదరాబాదు భూ పరీక్షా కేంద్రానికి పంపుతారు.

 అక్కడి పరీక్షల్లో జిల్లాలోని కొన్ని గ్రామాల సాగునేలల్లో సూక్ష్మ ధాతువులు పూర్తిగా లోపించాయని తేటతెల్లమైంది.  సూక్ష్మ ధాతువుల లోపాల వలన పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు సాగు నేలలో బతికే పరిస్థితి కనబడటం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 ఐదు గ్రామాల్లో అమలు...
 ఈ పథకాన్ని జిల్లాలోని బంటుమిల్లి మండలం కొర్లపాడు, కలిదిండి మండలం కొండంగి, గూడూరు మండలం గురిజేపల్లి, గుడ్లవల్లేరు మండలం గాదేపూడి, ముదినేపల్లి మండలం వైవాక గ్రామాల్లో అమలు చేస్తున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో క్లస్టరు(250ఎకరాలు)గా తీసుకున్నారు. ఈ గ్రామాల్లో 1,250మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

 సూక్ష్మ ధాతువుల్ని నివారించేందుకు వీరికి 50శాతం సబ్సిడీతో జిప్సం- 50టన్నులు, జింక్- 12.5టన్నులు, అగ్రిబోర్- 250 కిలోలు సరఫరా చేస్తున్నారు. ప్రాంతాల్ని బట్టి ఒక్కో రైతుకు ఎకరాకు జిప్సం- 40కిలోలు, జింక్- 10కిలోలు, అగ్రిబోర్- 400గ్రాముల్ని అందజేస్తున్నారు.

 మళ్లీ రెండేళ్ల వరకూ ధాతు లోపాలుండవు...
 ఒకసారి ఒక గ్రామంలో భూ చేతన పథకాన్ని అమలు చేస్తే ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు ధాతు లోపాల్ని భర్తీ చేసే విధంగా ఆ సీజనంతా పని చేస్తాం. మళ్లీ రెండేళ్ల వరకూ ఆ నేలల్లో ఆ ధాతు లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల్ని ఎప్పటికపుడు నిర్ధారించుకునే విధంగా రైతులకు శిక్షణ ఇస్తాం. పంటసాగుకు మేలైన కొత్త రకాల వంగడాల్ని సిఫారసు చేస్తాం. -జి.ప్రశాంత్‌కుమార్, జిల్లా భూ చేతన కో-ఆర్డినేటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement