బుక్‌ కీపర్‌ చేతివాటం!

Bank Staff Cheated Dwakra Women In Krishna - Sakshi

 బ్యాంక్‌ లావాదేవీలలో నగదు గోల్‌మాల్‌ చేసిన వైనం

సుమారు రూ.20 లక్షల వరకు రావాలంటున్న డ్వాక్రా మహిళలు

మోసపోయామని బాధితుల ఆవేదన

పామర్రు : బ్యాంక్‌ లావాదేవీల కోసం నియమితులైన బుక్‌ కీపర్‌ / బ్యాంక్‌ కరెస్పాండెంట్‌ చేతివాటం ప్రదర్శించింది. సుమారు రూ.20 లక్షల వరకు నగదును బ్యాంక్‌లో జమ చేయకుండా సొంతానికి వాడేసుకుంది. దీంతో డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ప్రాకర్ల గ్రామంలో 12 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలోని సభ్యుల లావాదేవీలు చూసేందుకు గ్రామానికి చెందిన సోనియా గ్రూపు సభ్యురాలైన గొంతుపులి నిర్మలను బ్యాంక్‌ వారు కరస్పాండెంట్‌గా నియమించారు. సంఘాల సభ్యుల రుణాలు రికవరీ కోసం, పొదుపు కోసం ఇచ్చిన నగదును బ్యాంక్‌లో జమ చేయటం వంటి పనులు ఆమెకు చేయాల్సి ఉంది. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇస్తున్న డ్వాక్రా రుణాలు, స్త్రీ నిధి రుణాలు పొందిన డ్వాక్రా మహిళలు వీటికి సంబంధించిన రుణాల రికవరీలను బుక్‌ కీపర్‌ బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఉన్న మహిళలు చాలా మంది నిరక్షరాస్యులని గ్రహించిన ఆమె వసూలు చేసిన నగదుని బ్యాంక్‌లో చెల్లించకుండా వాటిని తన అవసరాలకు వాడుకుంటూ కాలం గడుపుతోంది. బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలను సైతం సంబంధిత సభ్యులకు ఇవ్వకుండా తాత్సర్యం చేస్తోంది. వాటి కోసం ఎవరైనా అడిగితే ఇకపై మీకు రుణాలు రావంటూ.. బెదిరిస్తూ లక్షలలో సొమ్మును గల్లంతు చేసింది. ఇలా ఆరు నెలలుగా ఒక్కొక్క గ్రూపులో సుమారు రూ.2 లక్షల వరకు మొత్తం సుమారు రూ.20 లక్షల వరకు జమ చేయకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం.

అడిగితే ఎదురుదాడి..
డ్వాక్రా సంఘాలకు సంబంధించిన బ్యాంక్‌ పుస్తకాలు అన్నీ తన వద్దే పెట్టుకుని, ఎవరైనా పుస్తకం అడిగితే మిషన్‌ పని చేయటం లేదు, మీ డబ్బులను నేను తినేస్తానా.. అంటూ ఎదురు ప్రశ్నించేది. అమాయకులైన స్థానికులు సరేలే మన ఊరు అమ్మాయేగా ఏమౌతుందిలే అని ధీమాగా ఉన్నారు. ఈ విధంగా గ్రామంలోని అన్ని గ్రూపుల సభ్యుల నగదుని గుటకాయస్వాహా చేయటంతో సభ్యులు, స్థానికులు తొలుత సంబంధిత నిడిమోల బ్యాంక్‌కు వెళ్లి అక్కడి వారిని అడిగారు. తమకేమీ సంబంధం లేదు, మీ గ్రామంలో బ్యాంక్‌ కరస్పాండెంట్‌ ఉన్నది ఆమెను అడగండి.. అంటూ సమాధానం చెప్పారు. చేసేది లేక ఐకేపీ ఏపీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీఎం సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేసి హెచ్చరించారు. నీ మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.. సరి చేసుకోవాలని చెప్పారు. దీంతో నిర్మల ఈనెల 19, 20 తేదీలలో కొంత నగదుని (సుమారు రూ.4 లక్షలు) బ్యాంక్‌లో జమ చేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, మహిళలు అందరూ కలిసి బుధవారం పామర్రులోని ఐకేపీ కార్యాలయానికి వచ్చారు. ఏపీఎం లేకపోవడంతో అక్కడకు వచ్చిన సీసీని వివరణ అడిగారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బుక్‌ కీపర్‌ అక్కడికి చేరుకుని వారిని బతిమలాడింది. గ్రామ పెద్దల సమక్షంలో మిగిలిన బకాయిలను నెల రోజుల లోపు అందజేస్తానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. దీంతో మహిళలు శాంతించి వెనుతిరిగారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top