‘బంగారు తల్లి’కి కష్టమొచ్చింది. ఈ పథకం అర్హత కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘బంగారు తల్లి’కి కష్టమొచ్చింది. ఈ పథకం అర్హత కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంగారుతల్లి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే ఈ ధ్రువీకరణ పత్రం పొందడం ్ర„పహసనంగా మారింది. సాధారణంగా జనన ధ్రువీకరణ పత్రం పుట్టిన చోటే తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఎక్కువ జననాలు నగరంలోని ఆస్పత్రుల్లో జరగడంతో.. జనన ధ్రువీకరణ పత్రాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకోవాల్సి వస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీలో ధ్రువీకరణ పత్రం తీసుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం కావడంతో దరఖాస్తు దశలోనే గందరగోళం నెలకొంది.
ఏడాది మే ఒకటో తేదీ తర్వాత పుట్టిన ఆడబిడ్డ బంగారుతల్లి పథకానికి అర్హురాలు. పాపతల్లిదండ్రులు తెల్లరేషన్‌కార్డు పరిధిలో ఉండాలి. అదేవిధంగా ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటివరకు 4,800 మంది ఆడ బిడ్డలు జన్మించినట్లు ఐసీడీఎస్ అధికారులు ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 1,963 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్లో వచ్చాయి. వీరిలో 693 మంది మాత్రమే పూర్తిస్థాయి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అర్హత సాధించారు. వీరికి డెలివరీ చార్జీల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అందించారు. మిగిలిన వారి నుంచి జనన ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత అర్హత అంశాన్ని తేలుస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.
జనన ధ్రువీకరణతోనే చిక్కులు
జిల్లాలో పెద్ద ఆస్పత్రులు లేకపోవడంతో పేదలు నగరంలోని ఉస్మానియా, గాంధీలతోపాటు కొండాపూర్, వనస్థలిపురంలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాలో పట్టణ మండలాల్లో ఎక్కువ జననాలు నమోదువుతున్నాయి. వీరికి జనన ధ్రువీకరణ పత్రాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇందుకుగాను ముందుగా ‘మీసేవ’లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. క్షేత్ర పరిశీలన నిర్వహించిన అనంతరం ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడంతో ‘బంగారు తల్లి’ నమోదు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంగారు తల్లి పథకం ప్రారంభ సమయంలో ఎంతో ఆర్భాటం చేసిన సర్కారు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో దరఖాస్తులు రావడం లేదు.