బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు మన జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. జాతీయ నాయకుడిగా ఎదిగిన ఆయన రాజకీయ అరంగేట్రం జిల్లా నుంచే ఆరంభమైంది.
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు మన జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. జాతీయ నాయకుడిగా ఎదిగిన ఆయన రాజకీయ అరంగేట్రం జిల్లా నుంచే ఆరంభమైంది.
అప్పటి మేడారం అసెంబ్లీ, తర్వాత పెద్దపల్లి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ఈ ప్రాంతం నుంచే కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించి జిల్లావాసులకు దగ్గరయ్యారు. జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీలలో క్రియాశీలకంగా పనిచేసిన బంగారు లక్ష్మణ్‌కు జిల్లాలో ని చాలామంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి.
శనివారం మధ్యాహ్నం ఆయన మరణించారనే విషయం తెలుసుకున్న అభిమానులు విషాదానికి లోనయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ ఆవిర్భావానికి ముందు భారతీయ జన్‌సంఘ్ పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో బంగారు లక్ష్మణ్ 1972లో మేడా రం అసెంబ్లీ(ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం రెండువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న కుమారుడు, కాంగ్రెస్ పార్టీకి చెంది న అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడిసెల ఈశ్వర్‌పై బంగారు లక్ష్మణ్ పోటీ చేశారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల కర్మాగారం, అంతర్గాం స్పిన్నింగ్ వీవింగ్ మిల్లు కార్మిక సంఘాలకు నాయకుడిగా పలుమార్లు ఎన్నికయ్యారు. 1977 లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంఆర్.కృష్ణపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 1980లో శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఎమ్మెల్సీగా గెలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే శాసనమండలిని రద్దు చేయడంతో లక్ష్మణ్ పదవిని కోల్పోయారు.
అనంతరం పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి వాజ్‌పేయి కేబినెట్‌లో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. జాతీయ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రైల్వే మంత్రి హోదాలో పెద్దపల్లిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరి చేసింది ఆయనేనని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. బీజెపీ జాతీయ అధ్యక్షుడిగా 2000 సంవత్సరంలో ఎన్టీపీసీలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాలకు బంగారు లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో లక్ష్మణ్‌కు వెండి కిరీటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. 2008లో ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి, దివంగత బయ్యపు కిషన్‌రెడ్డిలు ఒకప్పుడు మంగారు లక్ష్మణ్‌కు ప్రధాన అనుచరులుగా కొనసాగినవారే. జనసంఘ్ పార్టీకి రాజీనామా చేసిన ముకుందరెడ్డి 1982లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బంగారు లక్ష్మణ్ మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బీజేపీ రాష్ట్ర అధికారిప్రతినిధి ఎస్.కుమార్, ఎఫ్‌సీఐ ఉద్యోగుల సంఘం నాయకులు బొర్ర సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.