రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు నుంచి శాసనసభా వ్యవహారాలశాఖను మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది.
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు నుంచి శాసనసభా వ్యవహారాలశాఖను మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. సీఎం కిరణ్ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కీలకదశకు చేరుకున్న తరుణంలో... ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సందర్భంగా శాఖ మార్పును తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణ ఆకాంక్షను అవమానించేలా ముఖ్యమంత్రి
వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్య నేతలు జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే బంద్‌లో పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తది తర నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. కార్యకర్తలు ఉదయం నుంచే బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
నగరంలో ఒకటి రెండు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగింది. తెరిచిన ఉన్న ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని, జిలేబీ సెంటర్‌ను కార్యకర్తలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తూ సామగ్రి ఎత్తేయడంతో ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు వచ్చి ఆందోళన సద్దుమణిగింపజేశారు. మిగతా పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ బంద్ ప్రభా వం కనిపించింది. జిల్లా అంతటా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరగలేదు. సినిమాహాళ్లు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు.
దిష్టిబొమ్మల దహనం
సీఎం తీరును నిరసిస్తూ అన్ని మండలాల్లో ఆయన దిష్టిబొమ్మల శవయాత్రలు, దహనాలు నిర్వహించారు. అనేక చోట్ల రాస్తారోకోలు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాయకులందరూ సీఎం తీరును ముక్త కంఠంతో ఖండించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం దిష్టిబొమ్మ శవయాత్రలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.
మంత్రి సొంత నియోజకవర్గం మంథనిలో కాంగ్రెస్ నాయకులు 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కాటారంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా సహచరులు అడ్డుకున్నారు. యైటింక్లయిన్‌కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించా రు. మంథని జేఎన్టీయూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. గొల్లపల్లి బస్టాండ్‌లో క్యారం ఆడుతూ నిరసన తెలిపారు. హుస్నాబాద్‌లో బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు.