మమ్మల్ని ఆదుకో అన్నా..!

 ayush employees meets ys jagan mohan reddy praja sankalpa yatra - Sakshi

వైఎస్‌ జగన్‌కు ఆయుష్‌ సిబ్బంది మొర

రాష్ట్రంలో ఉన్న ఆయుష్‌ కేంద్రాల్లో సిబ్బందిని ఆదుకో అన్నా అంటూ ఆయుష్‌ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం వారు జననేతను కలుసుకుని సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 587 ఆయుష్‌ డిస్పెన్సరీలను కేటాయించగా వీటిలో కేవలం 136 డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యాధికారులు ఉన్నారన్నారు. 

మిగిలిన 451 డిస్పెన్సరీల్లో ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్, పారా మెడికల్‌ సిబ్బంది భర్తీ కోసం 2014, 2016 సంవత్సరాల్లో ఆయుష్‌ కమిషనర్‌ వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినా భర్తీ కాలేదన్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందికి 2016 ఏప్రిల్‌ నుంచి జీతాలు, కాంట్రాక్టు రెన్యువల్స్‌ ఇవ్వడం లేదన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ కష్టంగా మారడంతో పాటు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళనకు గురౌతున్నామన్నారు.

 ఈ విధంగా నలుగురు సిబ్బంది మరణించారని వాపోయారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి 2012లో లేఖ కూడా రాశారని, తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తమ సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే మా సమస్యపై స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 451 ఆయుష్‌ డిస్పెన్సరీల్లో ఆయుష్‌ వైద్యులను నియమించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమకు జీతాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయుష్‌ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జె.లక్ష్మీనారాయణ, నాయకులు యూవీకే శాస్త్రి, పడాల పద్మావతి, వట్టికుళ్ల నాగమణి, పి.లలిత, మోహన్‌రాయ్‌ తదితరులు కోరారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top