లైసెన్స్‌ తీసుకుందాం.. ఎంచక్కా డ్రైవింగ్‌ చేద్దాం

Awareness on Vehicle Licence - Sakshi

లెర్నర్స్‌ లైసెన్స్‌ పాస్‌ కావడం సులభం

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా

వాహనాలు నడపడం నేరం

ఆధార్‌కార్డుతో లైసెన్స్‌ కోసం

దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రొద్దుటూరు క్రైం : డ్రైవింగ్‌ లైసెన్స్‌ అంటే చాలా మందిలో భయం పుట్టుకొస్తుంది. ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌లో కఠినమైన ప్రశ్నలు వస్తాయి.. పాస్‌కావడం కష్టమని చాలా మంది భావిస్తారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుకున్న వారిలోనూ పాస్‌ కాలేమేమో అనే భయం ఉంటుంది. కేవలం ఒక గంట సమయం కేటాయిస్తే చాలు ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ పాస్‌కావచ్చని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లెర్నింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌కు సంబంధించి 286 ప్రశ్నలు ఉంటాయి. వాటిలోని 20 ప్రశ్నలు ఎల్‌ఎల్‌ఆర్‌ కంప్యూటర్‌ టెస్ట్‌లో వస్తాయి. గూగుల్‌లో సర్చ్‌ చేసి ఎల్‌ఎల్‌ఆర్‌ మాక్‌టెస్ట్‌లో స్వతహాగా పాల్గొనవచ్చు. ఎల్‌ఎల్‌ఆర్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌ అని గూగుల్‌లో టైప్‌ చేసి కూడా 286 ప్రశ్నలను చూసుకోవచ్చు. ప్రొద్దుటూరు ఆర్టీఏ పరిధిలో ప్రొద్దుటూరుతో పాటు బద్వేల్, పులివెందుల ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. వాహనాలు నడుపుతున్న వారిలో చాలా మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు లేవు. ఇంజినీరింగ్, డిగ్రీలు చదువుకున్న యువకులు కూడా డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకోలేదని పోలీసు, రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో రవాణాశాఖ గత ఏడాది నుంచి  గ్రామాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియచేయడమే గాక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ఇతర వర్గాల వారిని లైసెన్స్‌ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ప్రాద్దుటూరు ఆర్టీఏ పరిధిలోని గ్రామాల్లో  ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహించి సుమారు 2800 మందికి ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేశారు.

లెర్నర్స్‌ లైసెన్స్‌కు దరఖాస్తు ఇలా..
ఏ వాహనం నడపడానికైనా ఎవరికీ నేరుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వరు.  ఏ రకం వాహనం నడపాలని భావిస్తున్నారో ఆ వాహనం నేర్చుకోవడానికి గాను ముందుగా లైసెన్స్‌ తీసుకోవాలి. వాహనం నడుపుట, నేర్చుకొనుటకు ఇచ్చే లైసెన్స్‌ను లెర్నర్స్‌ లైసెన్స్‌ అంటారు. లెర్నర్స్‌ లైసెన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. గతంలో మార్క్స్‌లిస్టు లేదా టీసీ అడిగేవారు. అయితే మారిన నిబంధనల ప్రకారం ఆధార్‌ కార్డు ఒక్కటి ఉంటే చాలు. అయితే ఆధార్‌ కార్డులో పుట్టిన తేది వివరాలు  (రోజు, నెల, సంవత్సరం) పూర్తిగా ఉండాలి. ఆధార్‌లో పుట్టిన తేది వివరాలు లేకుంటే మాత్రం ఆ«ధార్‌తో పాటు విద్యార్హతల సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేయాల్సి వస్తుంది. లెర్నర్స్‌ లైసెన్స్‌ కోసం ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏపీఆన్‌లై , మీ సేవా కేంద్రాలకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. నిర్ణీత తేదీ, సమయం లోపల సమీపంలోని రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లి ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌లో పాల్గొనాలి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం ఎలాగంటే..
వాహనాన్ని నడుపుటలో నైపుణ్యం, ట్రాఫిక్‌ సిగ్నల్స్, గుర్తులు, రహదారి నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకొని నెల రోజుల తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తిరిగి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను పొందుపరచి సంబంధిత పత్రాలను పూరించాలి. డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం క్లాస్‌ 1కు అంటే మోటార్‌ బైక్‌కు అయితే రూ. 960 ఫీజు చెల్లించాలి. బైక్, కారు (ఎల్‌ఎంవీ)కు కలిపి అయితే రూ. 1310 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో సొంత వాహనంతో డ్రైవింగ్‌ చేయాలి. డ్రైవింగ్‌ చేయడంలో మొదటి సారి ఫెయిల్‌ అయితే వారం రోజుల తర్వాత క్లాస్‌ 1కు రూ. 300, రెండింటికి అయితే రూ. 600 ఫీజు కట్టి రీ టెస్ట్‌కు హాజరు కావాలి.

ఎల్‌ఎంవీ లైసెన్స్‌ ఉంటే చాలు..
గతంలో మోటార్‌ బై క్, కారు, ఆటో, ట్రాక్టర్‌ ట్రాయిలర్, మోటర్‌ క్యాబ్‌లకు వేర్వేరుగా లైసెన్స్‌ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇటీవల ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. ఎల్‌ఎంవీ (మోటార్‌ బైక్, కారు) లైసెన్స్‌ ఉంటే చాలు అన్ని రకాల వాహనాలు నడపడానికి అర్హులని నిబంధనలను సడలించింది.

లైసెన్స్‌ లేకుండావాహనం నడపడం నేరం
18 ఏళ్లు నిండిన వారు మాత్రమే డ్రైవింగ్‌ లై సె న్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 ఏళ్లు నిండిన వారు లైసెన్స్‌ లేకుండా వాహ నం నడపడం నేరం. మైనర్లు వాహనం నడప డం ప్రమాదకరం.
సెక్షన్‌ 3 ఆఫ్‌ ఎంవీ యాక్ట్‌ ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా ఏ వ్యక్తి కూడా బహిరంగ ప్రదేశంలో వాహనం నడపరాదు.
సెక్షన్‌ 5 ఆఫ్‌  ఎంవీ యాక్ట్‌ ప్రకారం వాహన యజమాని లేదా హక్కుదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తిని వాహనం నడుపుటకు అనుమతించరాదు.
సెక్షన్‌ 150 ఆఫ్‌ ఎంవీ యాక్ట్‌ ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తిని వాహనం నడుపుటకు అ నుమతించిన వాహన యజమాని లేదా హక్కు దారునికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.వె య్యి జరిమానా లేదా రెండు శిక్షలు ఉంటాయి.
సెక్షన్‌ 181 ఆఫ్‌ ఎంవీ యాక్ట్‌ ప్రకారం డ్రైవిం గ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపిన వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా  రెండు శిక్షలు ఉంటాయి.  

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం చాలా సులభం
డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడంలో భయం వద్దు. లెర్నర్స్‌ టెస్ట్‌లో సులభతరమైన ప్రశ్నలు వస్తాయి. చదువుకున్న వారు గూగుల్‌లో సర్చ్‌ చేసి ఈ ప్రశ్నలను చూసుకోవచ్చు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం నేరం. దళారులను ఎవ్వరినీ సంప్రదించకుండా నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు. – వీర్‌రాజు, ఆర్టీఓ, ప్రొద్దుటూరు.

లెర్నర్స్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) టెస్టులో 20 ప్రశ్నలు
లెర్నర్‌ లైసెన్స్‌ టెస్టులో 20 ప్రశ్నలు మాత్రం ఉంటాయి. రవాణాశాఖ కార్యాలయంలోని కంప్యూటర్‌ సహాయంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ట్రాఫిక్‌ గుర్తులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్, రహదారి నిబంధనలతో  పాటు ఇతర రహదారి భద్రతకు సంబంధించిన ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. దరఖాస్తుదారుడు కోరుకున్న భాషలో కంప్యూటర్‌ టెస్ట్‌ నిర్వహించుకోవచ్చు. 10 నిమిషాల్లో 20 ప్రశ్నలకు గాను 12 వాటికి సరైన సమాధానాలు ఇస్తే ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ పాస్‌ అయినట్లే. లెర్నర్‌ లైసెన్స్‌ ఫీజు రెండు రకాలుగా ఉంటుంది. మోటార్‌ బైక్‌ అయితే రూ. 260, మోటార్‌ బైక్, కారు (ఎల్‌ఎంవీ)కు అయితే రూ.460 రుసుం చెల్లించాలి. మొదటి సారి ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ ఫెయిల్‌ అయితే మూడు రోజుల తర్వాత రూ. 50 ఫీజు కట్టి రీ టెస్ట్‌లో పాల్గొనాలి. రెండో సారి ఫెయిల్‌ అయిన వారు రూ. 50 ఫీజు కట్టి వారం రోజుల తర్వాత మళ్లీ టెస్టుకు హాజరు కావాలి. ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ పాస్‌ అయిన వాళ్లు నెల రోజుల తర్వాత గానీ, 5 నెలల లోపు గాని తగిన ఫీజు చెల్లించి డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి. లెర్నర్‌ లైసెన్స్‌ కలిగిన వారు వాహనం నడుపుతున్నపుడు వాహనానికి ముందు, వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో ‘ఎల్‌’ బోర్డు ప్రదర్శించాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన వ్యక్తి వారికి డ్రైవింగ్‌లో తర్ఫీదు ఇవ్వాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top