అత్తారింట్లో అల్లుడి వీరంగం బాలుడి హత్య | Attarintlo alludi virangam boy's murder | Sakshi
Sakshi News home page

అత్తారింట్లో అల్లుడి వీరంగం బాలుడి హత్య

Aug 26 2013 4:52 AM | Updated on Sep 1 2017 10:07 PM

అత్తారింటికి వచ్చిన అల్లుడు ఉన్మాదిగా మారి అర్ధరాత్రి బీభత్సం సృష్టించి ఒక బాలుడిని హతమార్చడమేకాక, భార్య, అత్త, మామపై కత్తితో దాడిచేసి తీవ్రంగా ...

మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్ :  అత్తారింటికి వచ్చిన అల్లుడు ఉన్మాదిగా మారి అర్ధరాత్రి బీభత్సం సృష్టించి ఒక బాలుడిని హతమార్చడమేకాక, భార్య, అత్త, మామపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శనివారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల కుమార్తె మంజులను కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కోనప్పనహళ్లి అగ్రహారానికి చెందిన  జయశీలన్ బెంజిమన్ అలియాస్ ప్రభుదాస్‌కు ఇచ్చి 2012 మే 25న వివాహం చేశారు.

వివాహ సమయంలో కట్నంగా రూ.2 లక్షలు నగదు, వంద గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని ఇచ్చారు. బెంజిమన్ జల్సాలకు అలవాటుపడి  సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం తేవాలని పెళ్లి అయిన మూడు నెలల నుంచే భార్యను వేధించేవాడు. దీంతో మంజుల పెళ్లి జరిగిన ఆర్నెల్లకే పుట్టింటికి చేరుకుంది. భార్య కాపురానికి రావాలంటూ  భర్త పెద్దమనుషులను తీసుకొచ్చి 15 రోజుల క్రితం పంచాయితీ పెట్టించాడు. రూ.4లక్షలు ఇస్తే అప్పులు తీరిపోతాయని అత్తమామలను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.

శనివారం రాత్రి మరోసారి అత్తగారింటికి వచ్చాడు. పెళ్లి సమయంలో పెద్దమనిషిగా వ్యవహరించిన వారిని వెంట తీసుకొచ్చి మళ్లీ పంచాయితీ పెట్టించాడు. కుమార్తెను కాపురానికి పంపాలంటే బెంజిమన్ తల్లిని, బంధువులను తీసుకురావాలని చెప్పారు మంజుల తల్లి దండ్రులు చెప్పారు. అప్పటికే పొద్దుపోవడంతో బెంజిమన్‌ను అక్కడే పడుకోనిచ్చారు. అతని పక్కనే తన భార్య అక్క కుమారుడు శశికుమార్(15) పడుకున్నాడు. అర్ధరాత్రి 1.30గంటల ప్రాంతంలో బెంజిమన్ తన వెంటతెచ్చుకున్న కత్తితో నిద్రపోతున్న శశికుమార్ ఛాతీ, మెడ, చేతులపై దారుణంగా పొడిచాడు. అరుపులకు పక్క గదిలో అత్త, మామ, భార్య బయటకు వచ్చారు. వారిపై కూడా దాడిచేసి కత్తితో పలుచోట్ల పొడిచాడు.

వారి అరుపులకు ఇరుగుపొరుగువారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బెంజిమన్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నలుగురిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  శశికుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పరీక్షించేలోపే మృతిచెందాడు. మంజుల, నరసింహులు(65), ఉత్తమ్మ(55) పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. డీఎస్పీ రాఘవరెడ్డి, వన్ టౌన్ సీఐ నారాయణస్వామిరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. మంజుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 నాన్నా.. ఒక్కసారి మాట్లాడరా..
 మంజుల అక్క ఉమకు శశికుమార్ ఒక్కడే కుమారుడు. తన పిన్నమ్మ పరిస్థితి బాధాకరంగా ఉండడంతో ఆమె కు తోడుగా ఉండేందుకు వచ్చి శశికుమార్ అక్కడే పడుకోవడంతో మృత్యువాత పడ్డాడు.  కొడుకు మృతితో కన్నీరుమున్నీరవుతున్న ఉమను ఓదార్చడానికి ఎవరివల్లా కాలేదు. ‘నాన్నా ఒక్కసారి మాట్లాడరా’ అంటూ కుమారుడి మృత దేహంపై పడి ఆ తల్లి రోదించడం పలువురిని కంటతడిపెట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement