కీలక ఘట్టం

Assembly special sessions from 20-01-2020 - Sakshi

నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై చరిత్రాత్మక బిల్లు!

13జిల్లాల ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులపై చర్చ 

ప్రాంతీయ స్థాయిలో పాలనకు అభివృద్ధి మండళ్ల ఏర్పాటు 

జిల్లాల వారీగా ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి ప్రత్యేక రోడ్‌ మ్యాప్‌

అమరావతి రాజధానిగా కొనసాగిస్తూనే పరిపాలన

రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు

ప్రతిపాదనలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం  

సీఆర్‌డీఏకు బదులుగా అమరావతి మెట్రోపాలిటన్‌

రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కసరత్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన బిల్లును ప్రతిపాదించనుందని తెలుస్తోంది. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వనున్నాయి.

ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలపై అధ్యయనం చేసి, హైపవర్‌ కమిటీ రూపొందించిన నివేదిక గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను చేరవేయడం.. తదితర అంశాలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించే అంశంపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. అనంతరం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో అజెండా ఖరారు చేయనున్నారు. 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది.  

అన్ని కమిటీలు అదే చెప్పాయి.. 
రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ, ఇటీవల జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చాయి. అది జరగాలంటే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే మార్గమని సూచించాయి. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనూ సమావేశమై.. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై నేటి క్యాబినెట్‌ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరికీ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్తు సమాచారం.  

సమగ్రాభివృద్ధే లక్ష్యం 
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ వివిధ కమిటీలు, నిపుణుల సూచనల మేరకు అసెంబ్లీలో సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. జిల్లాల వారీగా ప్రజల ఆకాంక్షల మేరకు చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, తదితర వెనుకబడిన జిల్లాల్లో సాగునీటి సౌకర్యం, ఇతరత్రా మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అన్ని ప్రాంతాల ప్రజల కష్టాలను స్వయంగా చూశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజలందరి ఆకాంక్షలు, కోరిక మేరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తోంది. కాగా, సీఆర్‌డీఏకు బదులుగా అమరావతి మెట్రోపాలిటిన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ విషయం కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.  

నేటి కార్యక్రమాలు ఇలా..
ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం 
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, అంశాలపై చర్చ  
హైపవర్‌ కమిటీ చేసిన సిఫార్సులపై ప్రజెంటేషన్‌
ఉదయం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల
సలహా సంఘం (బీఏసీ) సమావేశం. అజెండా ఖరారు  
ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 
అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 
13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top