పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది.
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్షం
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. నినాదాలు, ప్లకార్డులు, అరుపులు, కేకలతో సభ అట్టుడికింది. ఓ దశలో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుటే కాకుండా పోడియంపైకి చేరుకుని నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పరం వాగ్వాదాలతో పాటు ఉభయ పక్షాలు సభ మధ్యలోకి దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది.
పేపర్ల లీకేజీపై గురువారం ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ చేసేది లేదని కాసేపు, చేస్తామని కాసేపు అధికారపక్షం కాసేపు దోబూచులాడింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటలోపే స్పీకర్ సభను నాలుగు సార్లు వాయిదా వేశారు. లీకేజీపై ప్రభుత్వం మంగళవారం ప్రకటించినట్టుగా గురువారం సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షం సభ్యులు పట్టుబట్టగా ఇప్పటికే సీఎం వివరణ ఇచ్చినందున తిరిగి ఇవ్వాల్సిన పని లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కొట్టిపడేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు.