స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?

Ashok earned crores of money in Short time with Lokesh and Chandrababu Support - Sakshi

అనతికాలంలోనే కోట్లకు అధిపతి అయిన ‘డేటా స్కాం’ అశోక్‌

ఇంజినీరింగ్‌ చదవి పార్టీ సర్వే సంస్థ ఏర్పాటు

బీదా బ్రదర్స్‌ ప్రోద్బలంతో సీఎం, లోకేష్‌ కోటరీలోకి

రూ.65 కోట్ల ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఏర్పాటు

నలభై ఎకరాలకు పైగా కొనుగోలు..

100 సీజేఎఫ్‌ఎస్‌ రొయ్యల గుంటల్లో సాగు

అశోక్‌ పట్టుబడితే జాతకాలు మారిపోతాయని పెద్దల్లో భయం

ఏపీ పోలీసుల రక్షణలోనే ఉన్నట్టు ప్రచారం

సాక్షి, అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్‌ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్‌ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటా స్కామ్‌తో తెలంగాణ పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ పర్సన్‌గా వార్తల్లోకి ఎక్కిన అశోక్‌.. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌ ఆశీస్సులే కారణమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌!)

అశోక్‌ అనతికాలంలోనే రూ.65 కోట్ల విలువైన ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు అధిపతి ఎలా కాగలిగాడు? దాదాపు 40 ఎకరాలను ఎలా కొనగలిగాడు? తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్‌ఎస్‌ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడు?.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సెంటర్‌లో సామాన్య వ్యక్తిగా.. సాదాసీదా బైక్‌పై తిరిగిన అతను ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన కూర్చునే స్థాయికి ఎదిగేలా చేసిందెవరు? ..ఇలా అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు, నెల్లూరు జిల్లా కావలిలో మొదలైన అతని ప్రస్థానం అమరావతి వరకు సాగిన క్రమం ఇదిగో ఇలా ఉంది..  కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన అశోక్‌ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ తరఫున బుజ్జయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, కర్ణాటకలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అశోక్‌.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్‌కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెరగడంతో అశోక్‌ తండ్రి బుజ్జయ్యను టీడీపీలోకి తీసుకొచ్చాడు. అలా టీడీపీతో వారి బంధం మొదలైంది. (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్‌ టు సేమ్‌!)

లోకేశ్‌కు బినామీగా ఇలా..
రాజకీయ నాయకుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని సర్వేలు, సమీకరణాలు అంటూ అశోక్‌ పదేళ్ల క్రితమే డబ్బు సంపాదనే మార్గంగా రంగంలోకి దిగాడు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్‌ డాట్‌ కామ్‌ను స్థాపించాడు. అప్పట్లో ఇక్కడకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్‌ అధికారి జయప్రకాష్‌ నారాయణ, విద్యావేత్త చుక్కా రామయ్య వంటి ప్రముఖులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పార్టీ అనలిస్ట్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రజల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చాడు. ఈ క్రమంలోనే లోకేశ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. మూడేళ్ల క్రితం బీదా బ్రదర్స్‌ ద్వారా లోకేశ్‌తో అశోక్‌కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో వేమూరి హరిప్రసాద్‌ ద్వారా లోకేశ్‌కు మరింత దగ్గరయ్యాడు. సీఎం చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేశ్‌ను పలుమార్లు కలిసి ఐటీలో తన ఆలోచనా విధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే టీడీపీ సేవామిత్ర యాప్‌కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ లోకేశ్‌ తొలివిడతగా అప్పట్లో రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి లోకేశ్‌కు బినామీగా అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. 

యాప్‌ నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు
ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌కు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, లోకేశ్‌ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ రూపొందించింది. టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను కూడా తయారుచేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలుగుచూసిన డేటా స్కాంకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని సీనియర్‌ ఐఏఎస్‌లు చర్చించుకుంటున్నారు. 

పోలీసుల వద్దే అశోక్‌?
ఇదిలా ఉంటే.. అశోక్‌ ఇప్పుడు ఎక్కడున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేటా చోరీపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్‌ కింద ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా అతను పరారయ్యాడు. అతను పట్టుబడితే మొత్తం గుట్టురట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలే పోలీసుల రక్షణ కవచంలో రాజధాని పరిసరాల్లో కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలోని ఒక క్లబ్‌లో దాచిన అశోక్‌ను శుక్రవారం రాత్రి మంగళగిరి ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో అశోక్‌ ఉన్నట్టు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top