తొలి సమీక్షలోనే నేతల మధ్య వార్‌ | Arguments Between YSRCP And TDP In First Meeting | Sakshi
Sakshi News home page

తొలి సమీక్షలోనే నేతల మధ్య వార్‌

Jun 28 2019 10:00 AM | Updated on Jun 28 2019 10:24 AM

IN First Meeting  Arguments Between YSRCP And TDP - Sakshi

సమావేశంలో ఒకరినొకరు దూషించుకుంటున్న ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ సోము వీర్రాజు 

కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన తొలి సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. పౌర సరఫరాలు, హౌసింగ్, డీఆర్‌డీఏ, వ్యవసాయంపై జరిగిన సమీక్షలో గత ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు, అడ్డగోలు వ్యవహారాలు చర్చకొచ్చాయి. గత ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ఎత్తిచూపినప్పుడల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు చుర్రుమంది. ఒకానొక దశలో వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి మధ్య ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరింది.  ఒకరినొకరు తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దిగారు. సహనం కోల్పోయిన బుచ్చియ్య చౌదరి నాన్సెన్స్‌ వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌ అని దూషణకు దిగారు. కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. 

సోము వెర్సెస్‌ గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియచౌదరి రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తారా? గ్రామ వలంటీర్లను నియమించి డీలర్ల వ్యవస్థను తొలగిస్తారా? అంటూ మంత్రులను అడిగారు. ఈ సందర్భంగా చర్చ అంశం కాకుండా వివిధ పనుల బిల్లుల నిలుపుదల, హౌసింగ్‌ తదితర అంశాలపై గోరంట్ల ప్రశ్నిస్తుండగా  సోము వీర్రాజు జోక్యం చేసుకుని నాటి ప్రభుత్వ విధానాలు, నిర్వాకాలు తప్పుబట్టారు. అంతేకాదు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, వీటిని చర్చించేందుకు  చాలా సమయం ఉందని అనడంతో గోరంట్ల ఒక్కసారిగా సోము వీర్రాజుపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి అరుపులు, కేకలతో సమావేశం గందరగోళంగా మారింది. గోరంట్ల, సోములు వ్యక్తిగత దూషణలకు దిగారు. తొలుత ‘వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌’ అని గోరంట్ల అనగానే, ‘వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌’ అంటూ సోము ప్రతి స్పందించారు. ఆ తర్వాత నాన్సెన్స్‌ వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌ అంటూ గోరంట్ల అనడంతో అరుపులు, కేకలకు దారితీసింది. ఏకవచనంతో తిట్టుకోవడం కన్పించింది. దీంతో ఉపముఖ్యమంత్రి బోసు కలుగజేసుకోని ఇరువురికి నచ్చజెప్పడంతో గందరగోళం సద్దుమణిగింది.

హౌసింగ్‌పై సమగ్ర చర్చ
హౌసింగ్‌ చర్చకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఇళ్ల మంజూరులో వివక్ష చూపించారని మంత్రి కన్నబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా తుని, కొత్తపేటలో తీరని అన్యాయం చేశారని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్నారని అక్కడ అతి తక్కువ కేటాయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా కూడా ప్రస్తావించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ మాట్లాడుతూ తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు చెందిన ఇళ్లు పాడైపోయాయని వీటిని తిరిగి నిర్మించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు సడలించి రుణాలు అందించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రామచంద్రపురంలోని లెప్రసీ కాలనీలోని ఇళ్లు పడిపోతున్నాయని, వాటిని పరిశీలించి పునర్నిర్మించాలని  కోరారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు గత ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల విషయంలో జరిగిన జాప్యంపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు.

 మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటాలు లేకుండా పేదల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,పెండెం దొరబాబు, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, జ్యోతుల చంటిబాబు, కొండేటి చిట్టిబాబు,  గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు,  ఆదిరెడ్డి భవానీ, జిల్లా ఫారెస్ట్‌ అధికారి నందినీ సలారియా, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కమిషనర్‌  సుమిత్‌కుమార్‌గాంధీ, ఎటపాక ఐటీడీఏ పీఓ అభిషిక్త్‌ కిశోర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏఎస్పీ ఎస్‌వీ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టో రగడ 
టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన 640 హామీల్లో నాలుగైదు తప్ప మిగిలిన హామీలన్నీ అమలు చేయలేదని, తమ ప్రభుత్వం నవరత్నాల ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని వ్యవసాయశాఖామంత్రి కన్నబాబు అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు టీడీపీ పెట్టిన 640 హామీల మేనిఫెస్టో వివరాలను తమకు అందజేయాలని కోరారు. తాము కేవలం 274 హామీలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, వాటన్నింటికి అమలు చేశామన్నారు. 640 హామీల విషయాన్ని ముందు తెలుసుకోవాలని, అవసరమైతే నాటి మేనిఫెస్టో ఇస్తామని కన్నబాబు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చియ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు మధ్యలో లేచి తామిచ్చిన హామీలు తమకు తెలియవా, అవన్నీ అమలు చేశామని చెబుతుండగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ, జ్యోతుల చంటిబాబు జోక్యం చేసుకుని ఏవేవి చేయలేదో చెబుతామని, అవసరమైతే టీడీపీ మేనిఫెస్టో కాపీలను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు జరిగాయి.  

మా ప్రభుత్వం రైతు పక్షపాతి: కురసాల కన్నబాబు
రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షపాతి ప్రభుత్వంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని వ్యవసాయ, సహకార శాఖామంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రెండురోజులుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనేక సూచనలు చేశారని, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సేవాభావంతో ప్రజలకు పని చేయాలని సూచించారన్నారు. ఈ ఐదేళ్లు చాలా కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఒకే టీముగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పని చేద్దామని కన్నబాబు అన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అని విధాలుగా అభివృద్ది చేసేందుకు  మేథావులు, ప్రజలు తమ, తమ సూచనలు, సలహాలు అందించవచ్చన్నారు.

ఇంకా చంద్రబాబు ఫొటో ఏంటి?
ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంకా చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించి ఉంచారని, వీటిని తక్షణం మార్పు చేసి, జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మీసేవ కేంద్రాలు, పింఛన్ల పుస్తకాలు, రేషన్‌కార్డులపై ఉన్న ఫొటోలు తక్షణం మార్చాలని కోరారు.

1
1/1

సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వేదికపై మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement