‘రవాణా’ డ్రైవర్లకు రక్షణ చర్యలు భేష్

Appreciation of the Ministry of Central Transport and Highways to AP Govt - Sakshi

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రశంస

రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు 10 వేల ప్రొటెక్షన్‌ కిట్ల పంపిణీ

ఏపీని అనుసరిస్తున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో సరుకు రవాణా డ్రైవర్లకు రక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను భేషుగ్గా ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌అండ్‌ హైవేస్‌ (మోర్త్‌) మోర్త్‌ సంయుక్త కార్యదర్శి ప్రియాంక్‌ భారత్‌ ఏపీ రవాణా అధికారులను ప్రశంసించారు. ఏపీ విధానాలను తమ రాష్ట్రాల్లో అనుసరించాలని నిర్ణయించి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు ఏపీ అధికారులను సంప్రదించారు. ఇటు డ్రైవర్లలోనూ రవాణా శాఖ చర్యలపై మంచి స్పందన వస్తోంది. నిత్యావసరాలు, అత్యవసర సరుకులను తీసుకెళుతున్న డ్రైవర్లకు ప్రొటెక్షన్‌ కిట్‌లను అందిస్తూ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేలా భరోసా ఇస్తున్నారు. రవాణా శాఖ చేపట్టిన ఈ చర్యల తర్వాత 22 శాతం మంది డ్రైవర్లు గూడ్స్‌ రవాణాకు వెళుతున్నట్లు అంచనా. అంతేకాక జాతీయ రహదారుల వెంబడి ఉన్న ధాబాలలో ఆహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రూ.150 విలువైన కిట్‌ 
గూడ్స్‌ రవాణా డ్రైవర్లకు, ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా రూ.150 విలువ చేసే ప్రొటెక్షన్‌ కిట్‌ను అందిస్తోంది.  కిట్‌లో రెండు డెట్టాల్‌ సబ్బులు, ఒక శానిటైజర్, రెండు జతల గ్లవుజ్‌లు, నాలుగు మాస్క్‌లు ఉంటాయి. తొలుత 10 వేల కిట్లను, ప్రభుత్వం కేటాయించిన గూడ్స్‌ వాహనాల డ్రైవర్లకు అందించారు. దీనికి స్పందన రావడంతో త్వరలో మరో 20 వేల కిట్ల పంపిణీకి నిర్ణయించినట్లు రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.
► ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే డ్రైవర్ల ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా చెక్‌ పోస్ట్‌లలో థర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలు. పరీక్షలు నిర్వహించాకే అనుమతించాలని ఆదేశాలు.
► రైతుల ఉత్పత్తులు చేరవేసేందుకు అవసరమైన లారీలు, కంటైనర్లు అందుబాటులో ఉంచి, లారీ డ్రైవర్‌ ఓనర్స్‌ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి, డ్రైవర్లతో మాట్లాడి సరుకు రవాణాకు పంపించాలని నూతన మార్గదర్శకాల జారీ. 
► సరుకు రవాణా వాహనంలో డ్రైవరు, ఒక ప్యాసింజర్‌కు మాత్రమే అనుమతి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top