పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోలేదు

AP report did not report to the Center in the murder of YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న ఘటనలో కేంద్రానికి ఏపీ సమాచారం, నివేదిక పంపలేదు 

అది పౌర విమానయాన చట్ట పరిధిలోనిది 

దాని గురించి కేంద్రానికి సమాచారం, నివేదిక ఇవ్వడం తప్పనిసరి 

ఇటువంటి ఘటనలపై కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించవచ్చు 

హైకోర్టుకు నివేదించిన జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి 

ఈ కేసులో చాలా తీవ్రత ఉందన్న ధర్మాసనం 

పూర్తిస్థాయి వాదనలకు విచారణ డిసెంబరు 3కి వాయిదా 

అప్పటికల్లా కౌంటర్లు సిద్ధం చేస్తామన్న సీఐఎస్‌ఎఫ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోలేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి గురువారం హైకోర్టుకు నివేదించారు. పౌర విమానయాన చట్టం ప్రకారం.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకి వస్తుందని తెలిపారు. దీని ప్రకారం జగన్‌పై జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికను ఏపీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా పంపాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ పని చేయలేదని ఆయన వివరించారు. పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఉందన్నారు. రాష్ట్ర పోలీసులు పంపే నివేదిక ఆధారంగా ఎన్‌ఐఏ దర్యాప్తునకు అప్పగించే విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అయితే, రాష్ట్ర పోలీసులు చట్ట ప్రకారం కేంద్రానికి ఎటువంటి నివేదిక పంపలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన హైకోర్టు.. కేసులో చాలా తీవ్రత ఉందని, అందువల్ల పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టంచేస్తూ ఈ వ్యాజ్యంపై విచారణను డిసెంబరు 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వి భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.  

కాగా, తన మీద జరిగిన హత్యాయత్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలివ్వాలంటూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన పౌర విమానయాన చట్ట నిబంధనల గురించి వివరిస్తూ ఇటీవల ఓ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, జగన్‌పై హత్యాయత్నం ఘటనను ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిటిషన్లు దాఖలు చేశారు. విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై బోరుగడ్డ అనిల్‌కుమార్, మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కౌంటర్ల దాఖలు గురించి ఆరా తీయగా, కౌంటర్లు సిద్ధమయ్యాయని సీఐఎస్‌ఎఫ్‌ తరఫు న్యాయవాది లక్ష్మణ్‌ కోర్టుకు నివేదించారు. తదుపరి విచారణ నాటికి వాటిని కోర్టు ముందుంచుతానని ఆయన తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ఈ కేసులో చాలా తీవ్రత ఉందని మరోసారి గుర్తుచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top