వెలుగుచూస్తున్న శ్రీనివాసరావు అకృత్యాలు

AP Police Identified Jyothi Was Murdered By His Lover Srinivas Rao - Sakshi

శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌లో అమ్మాయిల నగ్న ఫొటోలు, వీడియోలు

గతంలోనూ అనేక మందిని మోసగించాడనే అనుమానాలు 

జ్యోతిని హత్య చేసిన వైనాన్ని పోలీసులకు వివరించిన అతని స్నేహితుడు పవన్‌

ఇప్పటికీ నేరం అంగీకరించని శ్రీనివాస్‌.. నేడు అరెస్టు చేసే అవకాశం

సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపుగా ఛేదించారు. పెళ్ళి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతో ఆమెను వదిలించుకునేందుకు స్నేహితుడు పవన్‌తో కలిసి శ్రీనివాసరావు పథకం ప్రకారం హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. 2 రోజుల క్రితం పవన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య ఎలా జరిగింది? హత్యకు వాడిన ఆయుధాన్ని ఎక్కడ పడేశారు? అన్న అంశాలపై పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ నెల 11న రాత్రి తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి జ్యోతిపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేయడమే కాకుండా తన తలపై బలంగా కొట్టి గాయపర్చారని ఇంతవరకూ శ్రీనివాసరావు చెప్తూవచ్చాడు.  (ప్రియుడే హంతకుడా?)

అయితే విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. స్నేహితుడు పవన్‌ సహాయంతో తన తలపై గాయపరుచుకుని సినీ ఫక్కీలో డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. రీ పోస్టుమార్టంలో జ్యోతిపై లైంగిక దాడి గానీ, లైంగిక దాడి యత్నం గానీ జరగలేదని, ఆమెను బలమైన రాడ్డులాంటి ఆయుధంతో కొట్టి చంపారని తేలడంతో శ్రీనివాసరావు కుట్ర బయటపడింది. హత్యకు పాల్పడిన విధానాన్ని పవన్‌ పోలీసులకు చెప్పిన వీడియోను చూపించినప్పటికీ శ్రీనివాసరావు మాత్రం తాను హత్య చేసినట్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులు బుధవారం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి అరెస్టు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నేరం అంగీకరించమని తమ కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని శ్రీనివాస్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

శ్రీనివాసరావు గతంలోనూ అనేక మంది యువతుల్ని మోసగించిన ఘటనలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌లో ఆధారాల కోసం వెతగ్గా పలువురు యువతుల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు ఉండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ వ్యవహారాలు జ్యోతికి తెలియడం వల్లే పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేసిందని చెబుతున్నారు. గతంలో శ్రీనివాస్‌ నేరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, జ్యోతి హత్య కేసులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే చేసినట్లు చూపించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ విజయభారతిపై వేటు పడనున్నట్టు తెలిసింది.  (కేసు ముగించే కుట్ర)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top