‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబుకు పాత్ర | AP MLA alla ramakrishna reddy petition in the supreme court on chandrababu | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబుకు పాత్ర

Nov 7 2017 2:57 AM | Updated on Oct 30 2018 4:08 PM

AP MLA alla ramakrishna reddy petition in the supreme court on chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నా తెలంగాణ ఏసీబీ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమవడమే కాకుండా తదుపరి దర్యాప్తును ఆపేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు ఓ ప్రజాహిత వ్యాజ్యంలో నివేదించారు. కేసులో అత్యంత ప్రభావశీలురు నిందితులుగా ఉన్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన ఈ రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్‌కు జత చేసి రెండూ కలిపి విచారిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, టి.విజయ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం దృష్టికి నివేదించారు.

ఈ పిటిషన్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ(ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి, బిషప్‌ హారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్‌ సింహా, మత్తయ్య జెరూసలేంలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించేలా ఆదేశించండి. ఓటుకు కోట్లు కేసును దర్యాప్తు చేయడంలో ఏసీబీ విఫలమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడు ఒక ఎమ్మెల్యే. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి. వీరిద్దరూ ప్రభావశీలురు. తెలంగాణ ఏసీబీని ప్రభావితం చేయగలిగిన వారు. దర్యాప్తు తొలిరోజుల్లో ఈ కేసులో అనేక సాక్ష్యాలు దొరికినా ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తదుపరి చార్జ్‌షీట్‌లో చేర్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసును దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు రాష్ట్రాల్లో పలుకుబడి కలిగిన ఈ నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. మరోవైపు నిందితులు సాక్ష్యాధారాలను లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది..’అని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

క్రిమినల్‌ అప్పీలుతో జత చేసిన ధర్మాసనం 
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన క్రిమినల్‌ అప్పీలు పిటిషన్‌ను లోతుగా విచారిస్తామని 06.03.2017న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజా రిట్‌ పిటిషన్‌ను ఈ క్రిమినల్‌ అప్పీలు పిటిషన్‌కు జత చేస్తూ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని పేర్కొంది.

న్యాయానికి అండగా సుప్రీంకోర్టు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు దర్యా ప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు న్యాయానికి, ధర్మానికి అండగా నిలిచిందని ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఆర్కే మీడియా తో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏవిధంగా అడ్డంగా దొరికిపోయారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌ లో మాట్లాడింది సీఎం చంద్రబాబే అని, ఆ ఫోన్‌ను లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ నుంచి వినియోగించారని లొకేషన్‌తో సహా ఏసీబీ అప్పట్లో నిర్ధా రించింది. ఈ విషయం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధృవీకరించిందని ఏసీబీ వెల్లడించింది. ఎవిడెన్స్‌ యాక్ట్‌–1872లోని సెక్షన్‌(10) ప్రకా రం కేసు విచారణకు ఈ సాక్ష్యాలు సరిపోతాయి. అయితే చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం ఈ కేసును ఏసీబీ నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే నిలువరించేందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిల్‌ దాఖలు చేశాం. ఇక ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు’ అని ఆర్కే పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement