ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాల సేకరణ

AP Govt has taken another initiative to identify Covid-19 Victims - Sakshi

నిర్ధారణ కోసం ఇతర రాష్ట్రాలకు పంపితే రూ. 1,000 చెల్లింపు

మన రాష్ట్రంలోని ల్యాబొరేటరీకి పంపిస్తే రూ. 200

ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ కరోనా లక్షణాలున్న వారి నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సేకరించి వైరాలజీ ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించేలా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

► అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు, నెట్‌వర్క్‌ పరిధిలో లేని ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించవచ్చు.
► ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించే శాంపిల్‌ తీయాలి. నిర్ధారణ కోసం దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపితే పీపీఈ కిట్‌లు, హ్యాండిలింగ్, ప్యాకేజీ, రవాణా చార్జీల కింద రూ. 1,000 ప్రభుత్వం చెల్లిస్తుంది.
► రాష్ట్రంలోని వైరాలజీ ల్యాబొరేటరీకి నిర్ధారణకు పంపిస్తే రవాణా ఛార్జీల కింద ఒక్కో నమూనాకు రూ. 200 చెల్లిస్తుంది.
► అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యమందిస్తే రూ. 16,405, పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందిస్తే కేసును బట్టి రూ. 65 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు చెల్లించేలా ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే.
► ఎక్కడైనా వైద్యం తీసుకుంటూ పేషెంటు మృతి చెందితే ఎన్నిరోజులు వైద్యమందించారో అన్నిరోజులకు బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది.
► ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, ఆరోగ్య రక్షలో ఉన్న వాళ్లందరికీ ఈ వైద్యం వర్తిస్తుంది.
► ఏరోజుకారోజు అనుమానిత లక్షణాలున్న, పాజిటివ్‌ వివరాలను ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లకు ఇవ్వాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top