
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా శానిటైజర్ కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 14 కంపెనీలకు శానిటైజర్లు ఉత్పత్తి చేసేందుకు ఔషధ నియంత్రణ శాఖ ద్వారా అనుమతులు ఇచ్చింది. అందులో ఇప్పటికే 9 కంపెనీలు ఉత్పత్తి చేపట్టి సరఫరాను సైతం ప్రారంభించాయి. వీటిలో ఒక్క కృష్ణా జిల్లాలోనే 4 కంపెనీలు శానిటైజర్ ఉత్పత్తి చేస్తున్నాయి. గుంటూరు, ఒంగోలు, నంద్యాలలో ఒకటి చొప్పున, విశాఖపట్నంలో రెండు కంపెనీలు శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్నాయి.
ఉత్పత్తి ఇలా..
- ప్రస్తుతం తొమ్మిది కంపెనీలు కలిపి రోజుకు 100, 180, 200 మిల్లీలీటర్ల చొప్పున 45 వేల బాటిల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి.
- ఇవికాకుండా అర లీటర్, లీటర్, 5 లీటర్ల బాటిళ్లను 11 వేల వరకు ఉత్పత్తి చేస్తున్నాయి.
- వీటిని మెడికల్ షాపులకు పంపించి సాధారణ ధరలకే అమ్మకాలు జరుపుతారు.
- ఇప్పటివరకూ అన్ని జిల్లాలకు 1.87 లక్షల శానిటైజర్లు పంపించామని ఔషధ నియంత్రణ శాఖ ఇన్‌చార్జి డీజీ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
- ఎక్కడైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
- రాష్ట్రంలో 1.07 లక్షల మాస్కులు అందుబాటులో ఉన్నాయి.
- రోజుకు 30 వేల మాస్కులు వినియోగిస్తున్నారు.
ఆరోగ్యశ్రీలో ఎమర్జెన్సీ కేసులకే అనుమతి
- కరోనా వైరస్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే కేసుల్లో అత్యవసరం అనుకుంటేనే అనుమతించాలని సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు.
- ఇన్ఫెక్షన్లను నివారించేందుకు, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
- గతంలో రోజుకు 2,400 కేసులు వచ్చేవి. కేవలం ఎమర్జెన్సీ కేసుల్ని తీసుకోవడం వల్ల ప్రస్తుతం 600 కేసులు మాత్రమే వస్తున్నాయి.
- వైరస్ వ్యాప్తి తగ్గితే.. ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని కేసులకూ తిరిగి పునరుద్ధరిస్తారు.
- ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగుల మధ్య సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆదేశాలు వెళ్లాయి.