
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య కార్యక్రమమైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది.
సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్ మోడ్‌లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’ అని జీవోలో పేర్కొన్నారు.