రివర్స్‌.. అదుర్స్‌ : రూ. 782.8 కోట్లు ఆదా

AP Government Saves Rs 782.8 Crore In Polavaram Reverse Tendering - Sakshi

పోలవరం రివర్స్‌ టెండర్లలో ఖజానాకు భారీ లాభం

12.6 శాతం తక్కువ ధరకు కోట్‌ చేస్తూ మేఘా సంస్థ బిడ్‌ దాఖలు.. 

హెడ్‌వర్క్స్‌లో రూ. 223.2 కోట్లు, జలవిద్యుత్‌ కేంద్రం పనుల్లో రూ. 559.6 కోట్లు మిగులు

నవయుగకు ‘డబ్బుల్‌’ ధమాకాతో ఖజానాను దోచుకున్న చంద్రబాబు బాగోతం బట్టబయలు

ఇప్పటికే పోలవరం 65వ ప్యాకేజీ పనుల్లో రూ.58.53 కోట్ల మిగులు

రివర్స్‌ ద్వారా పోలవరం పనుల్లో ఇప్పటిదాకా మొత్తం రూ.841.33 కోట్లు ఆదా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించే దిశగా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు  

సాక్షి, అమరావతి : పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ఖజానాకు రూ.782.8 కోట్లు ఆదా అయ్యాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సబబేనని, తిరుగులేనిదని మరోసారి రుజువైంది. టెండర్‌ నిబంధనలను అడ్డుపెట్టుకుని 4.8 శాతం అధిక ధర (రూ.3,216.11 కోట్ల)కు జలవిద్యుత్‌ కేంద్రం పనులను కట్టబెట్టిన సంస్థకే రూ.3,302.22 కోట్ల విలువైన హెడ్‌వర్క్స్‌ పనులను కూడా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడం ద్వారా ప్రజాధనాన్ని మాజీ సీఎం చంద్రబాబు లూటీ చేశారన్నది రివర్స్‌ టెండరింగ్‌ ‘సాక్షి’గా తేటతెల్లమైంది.

ఇప్పటిదాకా రూ.841.33 కోట్లు ఆదా.. 
పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిపోయిన రూ.1,771.44 కోట్ల పనులతోపాటు  జలవిద్యుత్‌ కేంద్రం పనులకు రూ.3,216.11 కోట్లు.. వెరసి రూ.4,987.55 కోట్ల అంతర్గత అంచనా వ్యయం తో చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లో 12.6 శాతం తక్కువ ధర (రూ.4359,11,87,000) కోట్‌ చేస్తూ ‘మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. దీనివల్ల ఖజానాకు రూ.628,43,13,000 ఆదా అయ్యింది. జలవిద్యుత్‌ కేంద్రం పనులను గతంలో నవయుగ సంస్థ 4.8 శాతం అధిక ధరకు దక్కించుకుంది. దీనివల్ల అప్పట్లో ఖజానాపై రూ.154.37 కోట్ల భారం పడింది. ఇప్పుడు తక్కువ ధరకే పనులు అప్పగించడంతో మొత్తం రూ.782.8 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయి. ఇందులో హెడ్‌ వర్క్స్‌ పనుల వాటా విలువ రూ.223.20 కోట్లు కాగా జలవిద్యుత్‌ కేంద్రం పనుల వాటా రూ.559.60 కోట్లు. ఇక ఇప్పటికే పోలవరం 65వ ప్యాకేజీకి నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో 58.53 కోట్లు ఖజానాకు మిగిలాయి.

దీంతో పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటిదాకా మొత్తం రూ.841.33 కోట్లు ఆదా అవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి కల్పతరువు అయిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ‘ఏటీఎం’లా మార్చుకున్నారన్నది మూమ్మాటికీ నిజమని రివర్స్‌ టెండరింగ్‌లో నిరూపితమవుతోందని జలవనరులశాఖ అధికారులు, నిపుణులు, కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టిన చంద్రబాబు ఏ స్థాయిలో ప్రజాధనాన్ని దోపిడీ చేశారో దీన్నిబట్టి అంచనా వేయవచ్చని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 

నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు..
పోలవరం పనులపై సమగ్ర దర్యాప్తు జరిపిన నిపుణుల కమిటీ రికార్డుల పరిశీలన ఆధారంగా రూ.3,128.31 కోట్లను టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని తేల్చింది. ఇందులో హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు స్పష్టం చేసింది. అవినీతి ప్రక్షాళనకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపంతో పనులు సజావుగా సాగడం లేదని రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ రెండు పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని సూచించింది. 

నిబంధనల ప్రకారమే..
పోలవరం హెడ్‌వర్క్స్‌లో నవయుగ, బీకెమ్‌ నామినేషన్‌ పద్ధతిలో దక్కించుకున్న రూ.3,302.22 కోట్ల పనుల్లో రూ.1,771.44 కోట్ల పనులు మిగిలిపోయాయి. రూ.3,216.11 కోట్లకు జలవిద్యుత్‌ కేంద్రం పనులు దక్కించుకున్న నవయుగ తట్టెడు మట్టి కూడా ఎత్తకుండానే రూ.782.20 కోట్లను దోచేసింది. హెడ్‌వర్క్స్‌లో మిగిలిన రూ.1771.44 కోట్ల పనులు, జలవిద్యుత్‌ కేంద్రం పనులు రూ.3,216.11 కోట్లు కలిపి మొత్తం రూ.4,987.55 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ ఆగస్టు 17న ‘రివర్స్‌ టెండరింగ్‌’ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 21 వరకు బిడ్‌లను స్వీకరించగా సోమవారం ఆర్థిక బిడ్‌ను తెరిచారు. 12.6 శాతం తక్కువ ధరకు కోట్‌ చేస్తూ మేఘా సంస్థ బిడ్‌ దాఖలు చేసినట్లు వెల్లడైంది. అంచనా వ్యయం కంటే 12.6 శాతం తక్కువ ధరకు కోట్‌ చేస్తూ సింగిల్‌ బిడ్‌ దాఖలైనప్పటికీ ఆమోదించవచ్చని ఏపీడీఎస్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ డీటెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌), కేంద్ర విజిలెన్స్‌ కమీషన్‌(సీవీసీ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ టెండర్‌ను అధికారులు ఖరారు చేశారు. అక్టోబర్‌ 1న మరోసారి కాంట్రాక్టర్‌ సాంకేతిక, ఆర్థిక అర్హతలను సమీక్షించి టెండర్‌ను ఆమోదించనున్నారు. 

జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో వేర్వేరుగా ఒప్పందాలు..
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంది. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు ఏపీ జెన్‌కో(ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుదుత్పత్తి సంస్థ) సారధ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పనులు దక్కించుకున్న మేఘాతో హెడ్‌వర్క్స్‌కు సంబంధించి జలవనరుల శాఖ అధికారులు ఒప్పందం చేసుకుంటారు. జలవిద్యుత్‌ కేంద్రం పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రివర్స్‌ టెండరింగ్‌లో నవయుగతో పోల్చితే 17.4 శాతం తక్కువ ధరలకు మేఘా దక్కించుకున్న నేపథ్యంలో ఆ వివరాలను జలవనరులు, ఏపీ జెన్‌కో అధికారులు హైకోర్టుకు నివేదించనున్నారు. జలవిద్యుత్‌ కేంద్రం పనులకు మేఘాకు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ జెన్‌కో ఒప్పందం చేసుకోనుంది. 


యుద్ధప్రాతిపదికన పోల‘వరం’..

పోలవరం పనులను నవంబర్‌ 1 నుంచి కొత్త కాంట్రాక్టర్‌తో ప్రారంభించి హెడ్‌ వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం శరవేగంగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలను తు.చ.తప్పకుండా అమలు చేస్తామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టం చేశారు. 24 నెలల్లోగా పోలవరం హెడ్‌ వర్క్స్, 58 నెలల్లోగా జలవిద్యుత్‌ కేంద్రం పనులను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో ‘మేఘా’ సంస్థకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ నిర్దేశించినట్లుగా పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడం ఖాయమని జలవవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.   

ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..
రాష్ట్రంలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని అధికారంలో ఉండగా చంద్రబాబు 2014 జూలై 23న శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ ఐదేళ్లలో రూ.65 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయం పెంచేసి.. కుదిరితే నామినేషన్‌ పద్ధతిలో లేదంటే టెండర్‌ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించి ఖజానాను లూటీ చేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక గత మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీతో విచారణ చేయించి చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెడతామని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తక్కువ ధరలకే పనులు చేయించి ఖజానాకు ఆదా చేస్తామని ప్రకటించారు.

ఆ మేరకు టీడీపీ సర్కార్‌ హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఏడుగురు రిటైర్డు ఈఎన్‌సీలు, సీఈలతో నిపుణుల కమిటీని నియమించారు. అక్రమాలను నిగ్గు తేల్చుతూ నిపుణుల కమిటీ నివేదికలు ఇచ్చిన ప్రాజెక్టుల పనులకు దేశంలో ఎక్కడా లేని రీతిలో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ రిజిస్టర్‌ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలైనా బిడ్‌లు దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తూ నిబంధనలు సడలించడం, ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌లో పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తుండటం పట్ల కాంట్రాక్టర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు చెల్లించాల్సిన ఆగత్యం లేకపోవడంతో అంచనా వ్యయం కంటే తక్కువ ధరలకే పనులు చేయడానికి ముందుకొస్తూ బిడ్‌లు దాఖలు చేస్తున్నారు. రూ.274.52 కోట్ల వ్యయంతో పోలవరం 65వ ప్యాకేజీకి నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ఖజానాకు 58.53 కోట్లు మిగలడం... తాజాగా హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల్లో రూ.782.8 కోట్లు ఆదా అవడాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాలన్న నియమాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ  అవినీతిని కూకటివేళ్లతో పెకళించి వేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అవడంతో ఇదే విధానాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసే దిశగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top