రైతు భరోసాకు రూ. 5,510 కోట్లు విడుదల

AP Government Releases Rs 5510 Crore For Rythu Bharosa - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు  కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా కింద రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించడంపై సోమవారం వ్యవసాయ మిషన్‌ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వ్యవసాయ మిషన్‌ సమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో మిషన్‌లోని వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొంటారు. ఈ సమావేశం రైతు భరోసా ప్రధాన అజెండాగా జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి.

అర్హత కలిగిన ప్రతి రైతుకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా లభ్ధి చేకూరనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top