శ్రీకాకుళం నుంచి శ్రీకారం

A.P Government Implementing Quality Rice Scheme From Srikakulam - Sakshi

తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇకపై నాణ్యమైన బియ్యం 

సాక్షి, అమరావతి: తెల్లరేషన్‌ కార్డులున్న పేదలందరికీ నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్‌ చేసి, వారి ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనుంది. సెప్టెంబర్‌ 1న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్యాకెట్లలో బియ్యం పంపిణీ చేయనున్నారు. 5, 10, 20 కిలోల బియ్యం ప్యాకెట్లను తయారు చేసే యంత్రాలను దశలవారీగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోగా రైస్‌ మిల్లర్ల వద్ద ఉన్న యంత్రాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లతో సంప్రదింపులు జరిపారు.  ప్యాకెట్లలో బియ్యం పంపిణీని మొదటి విడతగా సెప్టెంబర్‌ నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయనున్నారు.

అక్టోబర్‌లో విజయనగరం, నవంబర్‌లో పశ్చిమ గోదావరి, డిసెంబర్‌లో ప్రకాశం, వచ్చే ఏడాది జనవరిలో కర్నూలు, ఫిబ్రవరిలో అనంతపురం, మార్చిలో నెల్లూరు జిల్లాల్లో పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. వైఎస్సార్, తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి ప్యాకెట్లలో బియ్యం పంపిణీ అమలు కానుంది.  

పోర్టబులిటీ కొనసాగింపు 
రాష్ట్రంలో 1.47 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులుండగా, ఇందులో 30 లక్షల కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. వారు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునేందుకు వీలుగా పోర్టబులిటీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు గ్రామ వలంటీర్ల ద్వారా కాకుండా రేషన్‌ షాపుల (స్టాక్‌ పాయింట్లు) వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే బియ్యం ప్యాకెట్లు అందుతున్నాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం కొత్తగా 3 లక్షల ల్యాప్‌ట్యాప్‌లను కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. బియ్యం ప్యాకెట్లను వలంటీర్లు స్టాక్‌ పాయింట్ల వద్ద ఎప్పుడు తీసుకున్నారు, లబ్దిదారులకు ఎప్పుడు పంపిణీ చేశారో తెలుసుకునేందుకు లైవ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

సంచుల కోసం 3 నెలలకోసారి టెండర్లు 
బియ్యం సంచుల(ప్యాకెట్లు) కోసం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లను ఆహ్వానించారు. 73 బిడ్లు వచ్చాయి. తక్కువ ధర కోట్‌ చేసిన కంపెనీకి ప్యాకెట్ల సరఫరా బాధ్యతను అప్పగించారు. 5 కిలోల సంచికి రూ.9, 10 కిలోల సంచికి రూ.10, 20 కిలోల సంచికి రూ.14గా ధర నిర్ధారించారు. ఈ టెండర్‌ను ప్రస్తుతం రెండు నెలలకు మాత్రమే పిలిచారు. పారదర్శకత కోసం ప్రతి మూడు నెలలకోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా 1.67 కోట్ల సంచులు అవసరమని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 130 ప్రాంతాల్లో బియ్యం ప్యాకింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. 

బయట మార్కెట్‌లో విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తాం. మున్ముందు స్వర్ణ, 1121 రకం, నెల్లూరు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  సెప్టెంబర్‌ 1న శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం చేరవేస్తాం. వలంటీర్లకు పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.500 ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించాం.    
  – కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top