ఆశల తీరాన.. గంగపుత్రులకు నజరానా!

AP Government Focusing On Jetty In Visakhapatnam - Sakshi

కోరుకున్న చోట జెట్టీల నిర్మాణానికి సీఎం జగన్‌ నిర్ణయం

 సాహసోపేత నిర్ణయమని మత్స్యకారుల ఆనందం

లక్షలాది మంది మత్స్యకారులకు లబ్ధి

మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఆ వర్గాల్లో సర్వత్రా ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించలేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం తమకు ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని మత్స్యకారులంతా స్వాగతిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు.

సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి చేపల వేట సాగక అత్యధికంగా మత్స్యకారులు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక్క గుజరాత్‌కే 25 వేల మంది మత్స్యకారులు వలస వెళ్తున్నట్టు సమాచారం. తండేలు అని పిలవబడే నాయకుడు ఇక్కడి మత్స్యకారులను సమీకరించి ఆయా కుటుంబాలకు అడ్వాన్స్‌ ఇచ్చి తీసుకువెళ్తున్నాడు. అలా వలస వెళ్లిన వారు తిరిగి సొంత గ్రామానికి చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. గుజరాత్‌కు వెళ్లిన వారు వేటను కొనసాగిస్తూ.. పాకిస్థాన్‌ సముద్ర జల్లాల్లో ప్రవేశిస్తూ.. అక్కడి తీరరక్షణ దళానికి చిక్కి జైలు పాలవుతున్నారు. రాత్రి సమయంలో వేటకు వెళ్లి.. బోటుపైనే నిద్రించి.. ఆ నిద్రలో జారి సముద్రంలో పడి మరణిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. 

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై పెరుగుతున్న భారం
విశాఖ జిల్లాకు సంబంధించి 13 మండలాల్లో 132 కిలోమీటర్లు విస్తరించిన తీర ప్రాంతంలో 63 మత్స్యకార గ్రామాలున్నాయి. ఇందులో 44 గ్రామాలకు చెందిన సుమారు 1,50,000 మంది మత్స్యకారులు చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో çసుమారుగా 15 నుంచి 20 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ మీద జీవిస్తున్నారు. వీరు కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన  మరో ఆరేడువేల మంది మత్స్యకారులు హార్బర్‌ మీద జీవిస్తున్నారు. జిల్లాలో చూసుకుంటే ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్తజాలరిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవుపోలవరం, తీనార్ల, రాజయ్యపేట తదితర గ్రామాలకు సంబంధించిన మరబోట్లు 750, ఫైబర్‌ బోట్లు 1500, తెప్పలు 3000 ఉన్నాయి.

ఫిషింగ్‌ హార్బర్లో నిర్మించిన 11 జెట్టీలలో ఈ బోట్లు, ఫైబర్‌బోట్లు, తెప్పలు నిలిపి ఉంచుతున్నారు. 1973లో 100 మరబోట్లు నిలిపి ఉంచేందుకు అనువుగా నిర్మించిన హార్బర్‌ నేడు వేల బోట్లకు ఆశ్రయంగా మారింది. దీంతో ఇక్కడ రద్దీ ఎక్కువై బోట్ల యజమానులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంతో పాటు అనువైన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జెట్టీలను నిర్మించాలని సూచించారు.


పూడిమడక మొగ వద్ద జట్టీ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ జట్టీ నిర్మిస్తే వెయ్యి పడవలతో వేటకు అనుకూలంగా ఉంటుంది. సెజ్‌ పరిశ్రమలకు సముద్రమార్గంలో రవాణా సదుపాయం కలుగుతుంది. మొగ వద్ద జట్టీ నిర్మాణానికి వీలుగా ఉన్న ప్రదేశం ఇదే..

భీమునిపట్నంలో జెట్టీలు నిర్మిస్తే... 
భీమునిపట్నంలో కనీసం 5 జెట్టీల నిర్మాణం జరిగాలని మత్స్యకారులు కోరుతున్నారు. దీని వల్ల భీమునిపట్నం, నాగమయ్యపాలెం, చింతపల్లి, అన్నవరం, చేపలకంచేరు, ముక్కాం, ఉప్పాడ, మంగమారిపేట తదితర గ్రామాల నుంచి వచ్చే మరబోట్లు, ఫైబర్‌బోట్లను అక్కడే నిలిపి ఉంచవచ్చు. ఆయా గ్రామాల నుంచి బోట్లతో పాటు అందులో పనిచేసేందుకు కలాసీలు, డ్రైవర్లు, ప్యాకింగ్‌ చేసే యువకులు జీవనోపాధి నిమిత్తం విశాఖ చేరుకుని.. ఇక్కడ అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భీమిలిలో జెట్టీల నిర్మాణం జరిగితే వీరంతా తమ సొంత గ్రామాల్లో నివసిస్తూ పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

భావనపాడు హార్బర్‌ కథ ఇదీ.. 
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి బోట్లు ఒడిశా సరిహద్దుల వరకు వేటకు వెళ్తాయి. మత్స్యకారుల సౌకర్యార్థం 2002లో భావనపాడు హార్బర్‌ను సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడ భారీ జెట్టీని నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకూ ఈ హార్బర్‌ ప్రారంభానికి నోచుకోలేదు. ముఖద్వారం వద్ద ఇసుక మేటలు వేయడంతో పడవలు హార్బర్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 2003లో నిపుణుల బృందం భావనపాడు హార్బర్‌ పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో అప్పటి ప్రభుత్వం జపాన్‌ నుంచి డ్రెడ్జర్‌ను సమకూర్చి ఇసుకను తవ్విపోసేందుకు సిద్ధం అయిన సందర్భంలో.. అనుకోని అవాంతరాల కారణంగా డ్రెడ్జర్‌ మరమ్మతులకు గురైంది. డ్రెడ్జర్‌ మరమ్మతులకు అయ్యే ఖర్చు కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం.. పని మీదే కనుక రాష్ట్రమే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఒకరిమీదకు ఒకరు నెట్టుకోవడంతో డ్రెడ్జర్‌ కాస్తా జపాన్‌ వెళ్లిపోయింది. రూ.కోట్లతో నిర్మించిన భావనపాడు హార్బర్‌ అలా నిరుపయోగంగా మిగిలిపోయింది.

ఇసుక మేట సమస్యకు పరిష్కారం
హార్బర్‌ ముఖద్వారం వద్ద పేరుకుపోతున్న ఇసుకను తొలగించడం కష్టం. అందుకే ఇసుక ముఖద్వారాన్ని కప్పేయకుండా హార్బర్‌లోకి ప్రవేశించే ముఖద్వారం వద్ద నిరుపయోగంగా ఉన్న భారీ పడవలను సముద్రంలో ముంచేయాలని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. విశాఖపట్నం ఇన్నర్‌ హార్బర్‌లోకి వెళ్లే చానల్‌ ముఖ ద్వారం వద్ద ఇదే తరహా సమస్య ఉండేదని, అప్పటి ఇంజినీర్లు భారీ నౌకలను సముద్రంలో ముంచేయడంతో సమస్య పరిష్కారం అయ్యిందంటున్నారు.

తుపాన్ల నుంచి రక్షణ..
విశాఖ హార్బర్‌ నుంచి ప్రతి నిత్యం వెళ్తున్న మరపడవలు ఒడిశా తీరంలోని గోపాల్‌పూర్‌ వరకు వెళ్తుంటాయి. సముద్రంలో వేట చేసే సమయంలో తుపాన్లు సంభవిస్తే మత్స్యకారులు తమ పడవలను గోపాల్‌పూర్‌ వైపు తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో విశాఖ చేరుకోవాలంటే కనీసం 36 గంటల సమయం పడుతుంది. అదే భావనపాడు హార్బర్‌ను 15 గంటల్లో చేరుకుని ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంది. భావనపాడు హార్బర్‌ను పునరుద్ధరిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.

పూడిమడకలో జెట్టీ నిర్మిస్తే.. 
పూడిమడకలో జెట్టీ నిర్మించాల్సిన అవసరం ఉందని పరిసరాల్లోని మత్స్యకార గ్రామ పెద్దలు చెబుతున్నారు. పూడిమడక పరిసరాల్లో తంతడి, ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెంజాలరిపేట, తిక్కవానిపాలెం, అప్పికొండ, గంగవరం తదితర గ్రామాల్లో సుమారు 30వేల పైగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరంతా చేపలవేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఈ ప్రాంతాల వారికి సంప్రదాయ పడవలతో పాటు ఫైబర్, మరపడవలు కూడా ఉన్నందున జెట్టీ నిర్మిస్తే విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌తో పనిలేకుండా ఇక్కడి నుంచే వేటకు వెళ్లవచ్చు. ఈ జెట్డీ నిర్మాణానికి రూ.560 కోట్లు విడుదలయ్యాయని, కేంద్ర, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భావనపాడు హార్బర్‌ పునరుద్ధరించాలి
కోట్ల రూపాయలతో నిర్మించిన భావనపాడు హార్బర్‌ను ప్రభుత్వం పునరుద్ధరిస్తే.. మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తుపాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మ త్స్యకారులు తమ పడవలను అక్కడ లంగరు వేసుకుంటారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.
– సీహెచ్‌.సత్యనారాయణమూర్తి, అధ్యక్షుడు, డాల్ఫిన్‌ మరపడవల సంఘం

పూడిమడకలో జెట్టీ నిర్మించాలి
పూడిమడక పరిసర గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరంతా చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. వీరి బోట్లను, పడవలను విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో నిలిపి ఉంచాల్సి వస్తోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.  పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి అనుకూలంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలి.
– చోడిపల్లి అప్పారావు, మత్స్యకార నాయకుడు, పూడిమడక మాజీ ఉపసర్పంచ్‌

నిధులు వెనక్కి వెళ్లిపోయాయి
టీడీపీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేధాలతో పూడిమడక జెట్టీ నిర్మాణానికి మంజూరైన రూ.560 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ప్రాంతంలో జెట్టీ నిర్మాణం అవసరం ఉంది. మార్కెట్‌ సదుపాయం ఉన్న ఈ ప్రాంతంలో బోట్లను నిలిపి ఉంచే సౌకర్యం ఉంటే.. మత్స్యకారులు వేటను సులభంగా కొనసాగిస్తారు.
– మేరుగు అప్పలనాయుడు, మత్స్యకార నాయకుడు, పూడిమడక మాజీ ఎంపీటీసీ

బోటు మునిగిపోయింది
భావనపాడులో హార్బర్‌ సదుపాయం లేకపోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో నా బోటు మునిగిపోయి రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. తుపాను వస్తుందని తెలుసుకుని ఒడిశా తీరంలోని గోపాల్‌పూర్‌ హార్బర్‌కు చేరుకున్నా.. ఫలితం లేకపోయింది. భావనపాడులోని హార్బర్‌ను పునరుద్ధరిస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు.
–మైలపల్లి రాము, బోటు యజమాని

వలసలు పోకుండా చూడాలి
బోటు నడపడం తప్ప మరో వృత్తి తెలియని కారణంగా.. 20 ఏళ్లుగా బోటు డ్రైవరు గానే పనిచేస్తున్నాను. స్వగ్రామం నుంచి విశాఖ వలస వచ్చాను. నగరంలో కుటుంబంతో బతకడం చాలా కష్టంగా ఉంది. భీమిలిలో జెట్టీలను నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే వలసలు తగ్గుతాయి.
– అల్లిపిల్లి రాము, భీమిలి

మత్స్యకారులకు అనువుగా నిర్మిస్తేనే మేలు 
మత్స్యకారులకు అనుకూలంగా జెట్టీల నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఇంతవరకూ ఏ సీఎం తీసుకోని నిర్ణయాన్ని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో పెరుగుతున్న బోట్ల ఒత్తిడి తగ్గాలంటే భీమిలిలో జెట్టీలు నిర్మించాల్సిన అవసరం ఉంది.
–దూడ ధనరాజు, బోటు యజమాని, అధ్యక్షుడు, మహావిశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ మత్స్యకారుల సంక్షేమ సమాఖ్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top