ఏపీలో ‘మత్తు’ వదులుతోంది | AP Government Decisions, Good Result On Liquor Control | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘మత్తు’ వదులుతోంది

Nov 2 2019 9:26 PM | Updated on Nov 2 2019 9:43 PM

AP Government Decisions, Good Result On Liquor Control - Sakshi

సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అందించిన తాజా వివరాలు ప్రకారం..

2018 అక్టోబరులో 32,28,366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా, 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్మారు. గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. అదే బీరు అమ్మకాలు చూసుకుంటే  2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్ముడు కాగా, ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించారు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వచిన తర్వాత రాష్టంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 4380 నుంచి 3500కు తగ్గించడమే కాకుండా, మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో విక్రయాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం.

బెల్టుషాపులు కనుమరుగు..
మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు కనుమరుగయ్యాయి. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు. బెల్టుషాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టం చేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం ద్వారా మద్య నియంత్రణ, నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల అమలుపై ప్రభుత్వం తన సంకల్పాన్ని గట్టిగా చాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement