యురేనియం కాలుష్యానికి ముకుతాడు

AP Government Control Uranium Pollution In Tummalapalle - Sakshi

సీఎం చొరవతో పీసీబీ రంగప్రవేశం

11మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు 

బాధిత గ్రామాల్లో పర్యటించనున్న బృందం

సాక్షి, వేముల(కడప) : పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా యురేనియం గ్రామాల్లో అధ్యయనానికి 11మందితో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ బృందానికి ముంబాయి అణుశక్తి నియంత్రణ మండలికి చెందిన అణు ప్రాజెక్టుల భద్రతా విభాగాధిపతి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. ఈయన ఆధ్వర్యంలో ఈ బృందం సోమ, మంగళవారాలలో యురేనియం గ్రామాల్లో పర్యటించనుంది. ఇక్కడి కాలుష్యం, కలుషిత జలాలపై అధ్యయనం చేసి కాలుష్య నియంత్రణ మండలి ఈనెల 11న నివేదిక అందజేయనుంది.

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్‌ పాండ్‌కు తరలిస్తున్నారు. టైలింగ్‌ పాండ్‌లోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. కలుషిత నీటితో సాగులో ఉన్న అరటి, మిరప, వేరుశనగ పంటలు ఎదుగుదలేక గిటకబారిపోయాయి. అరటి తోటలకు సాగునీటిని అందిస్తే భూమిపై తెల్లని రసాయన పదార్థం పేరుకపోతోంది. దీంతో సాగులో ఉన్న పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ బోర్లలో నీరు కలుషితం కావడంతో రైతులు పంటలు సాగు చేయడంలేదు. పంటలు సాగు చేసిన కలుషిత నీటితో పంట దెబ్బతిని పెట్టుబడులురాక గిట్టుబాటు కావని రైతులు పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. టైలింగ్‌ పాండ్‌ పరిధిలోని కె.కె.కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లో వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి. యురేనియం కాలుష్యం ఈ గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. 


కలుషిత నీటిని పంటకు ఇవ్వడంవలన భూమిపై ఏర్పడిన తెల్లని పదార్థం  

అధ్యయన కమిటీ.. 
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమించిన నిపుణుల బృందం యురేనియం బాధిత  తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించనుంది. కలుషిత జలాలతో పంటలు దెబ్బతిని నష్టపోయామని.. పంట సాగు చేసుకోలేక పొలాలను బీళ్లుగా ఉంచుకున్నామని.. జీవనాధారం కోల్పోతున్నామని.. వ్యాధులు ప్రబలుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలికి రైతులు, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి యురేనియం కాలుష్యంపై అధ్యయనానికి నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. అధ్యయన కమిటీ 9, 10వ తేదీలలో పర్యటించనుంది.

గ్రామాలలో రెండు రోజులపాటు కమిటీ బృందం పర్యటించి యురేనియం కాలుష్యంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. యురేనియం గ్రామాల్లో ఎంతమేర కాలు ష్యం, భూగర్భజలాల కలుషితమయ్యాయనే తదితర అంశాలపై నిపుణుల కమిటీ అంచనాకు రానుంది. ఇక్కడి గ్రామాల్లో అధ్యయనం చేశాక నివేదిక తయారు చేసి ఈనెల 11న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అందజేయనుంది. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఇటీవల పులివెందులలో ఇక్కడి కాలుష్య సమస్యపై సమావేశమైన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు కావడం పట్ల బాధిత గ్రామ రైతాంగం ఆనందం వ్యక్తంచేస్తోంది. ప్రతినెల కాలుష్య సమస్యపై వివరాలు తెలుసుకుంటానని ఆయన స్వయంగా అధికారులకు చెప్పారు. సంస్థ ప్రతినిధులతో కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

నిపుణుల కమిటీకి సమస్యలు వివరించండి
ఈ నెల 9,10 తేదీలల్లో జిల్లాకు రానున్న తుమ్మలపల్లె యురేనియం కాలుష్యంపై జిల్లాకు రానున్న నిపుణుల కమిటీకి తమ సమస్యలను వివరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లె ప్రజలు తమ భవిష్యత్తు బాగుపడుతుందని యురేనియం ప్రాజెక్టుకు భూములు ఇస్తే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటికి కారణం పరివ్రమకు సంబంధించిన టెయిల్‌ ఫాండ్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలువ్యాధులతో అల్లాడిపోతున్నారన్నారు. జిల్లాకు వస్తున్న నిపుణుల కమిటీలో శ్రాస్తవేత్తలు, ఇంజనీర్లు, సివిల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, జియాలజీ, భూగర్బగనుల శాఖ, ఉద్యానశాఖ అధికారులతోకూడిన నిపుణలు కమిటీ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కమిటీ ముందు యురేనియం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తమ సమస్యలను వివరించాలన్నారు. సీపీఐ నాయకులు పులి కృష్ణమూర్తి, ఎల్‌. నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఇది చదవండి : యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top