ఏటా రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీలో సేవా టికెట్లు, లడ్డూ ధరలు పెంచాలని భావించడం సబబు కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
తిరుమల : ఏటా రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీలో సేవా టికెట్లు, లడ్డూ ధరలు పెంచాలని భావించడం సబబు కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భక్తులపై భారం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలన్న ధార్మిక సంస్థ ఆలోచన మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే భక్తులు ముందుకొస్తుంటే సామాన్య భక్తులపై భారం మోపే చర్యలు మానుకోవాలని సూచించారు.
టీటీడీ ఆదాయ వ్యయాలకన్నింటికీ ఆడిట్ జరగాల్సిందేనన్నారు. భక్తులు సమర్పించే కానుకల్లో వాడే ప్రతిపైసాకు లెక్కచూపి, భక్తులకు జవాబు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ నిర్వహించిన కొన్ని స్కీములు, ఎస్‌వీబీసీతోపాటు ఖర్చులపై ఇంకా ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ వ్యవహారాలపై ఏప్రిల్‌లో సమావేశం నిర్వహించి సమీక్షిస్తామన్నారు. రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్ది, పేదరహిత సమసమాజ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు.