
సాక్షి, విశాఖపట్నం : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా, నగర పరిధిలో 11 కేంద్రాలను కేటాయించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఇంజినీరింగ్, 25న అగ్రికల్చర్, మెడికల్ వారికి, 24, 25 తేదీల్లో ఈ రెండూ రాసే వారికి అవకాశం కల్పించారు. విశాఖ జిల్లా నుంచి మొత్తం 25,028 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 19,084, అగ్రికల్చర్, మెడికల్‌లకు 5,944 మంది హాజరుకానున్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు స్లాట్‌లను ఇచ్చారు.
వీరు పరీక్షా సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, దరఖాస్తు నకలుపై అంటించిన ఫొటోపై అటస్టేషన్ కాపీ, ఎస్సీ, ఎస్టీలైతే కులధృవీకరణ పత్రం నకలు, నలుపు, నీలం రంగు పెన్నులను అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రఫ్‌కు అవసరమైన పేపర్లను కేంద్రంలో నిర్వాహకులే ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 160 బిట్ ప్రశ్నలకు (160 మార్కులకు) సమాధానం రాయాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి 40 బస్సులు అదనంగా నడపనుంది.