‘మేము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తాం’

AP DGP RP Thakur Comments On ACB Actions  - Sakshi

విజయవాడ: తాము ఏం చేసినా చట్టప్రకారం చేస్తామని, ఏసీబీలో సొంత నిర్ణయాలు ఉండవని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అన్నారు. విజయవాడలోని ఏసీబీ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏసీబీ డీజీ హోదాలో ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఓ అధికారి అవినీతి గురించి గత నెల 28న లోకేష్‌ అనే వ్యాపారి నుంచి సీబీఐకి ఫిర్యాదు అందింది. అంతకు ముందే గత నెల 22న ఈ ఫిర్యాదును లోకేష్‌ విజయవాడ ఏసీబీ డీఎస్పీకి ఇచ్చారు. ఏసీబీకి ముందుగానే లోకేష్‌ ఫిర్యాదు చేసిన విషయం సీబీఐ తెలియదు. మమ్మల్ని సీబీఐ సహకరించమని కోరే సమయానికే ఏసీబీ ఆ అధికారిపై ట్రాప్‌ సిద్ధం చేసింద’ ని తెలిపారు. 

ఇంకా మాట్లాడుతూ.. ‘ సమాచారం మాకు ఎవరిచ్చినా వారి పేర్లు బయటపెట్టం. కేంద్ర ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తుంటే ఏసీబీ మౌనంగా కూర్చోవాలా..?. ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగితే ఏసీబీనే చర్యలు తీసుకుంటుంది. ఏపీలో అవినీతి నిర్మూలనకు అందరి సహకారం తీసుకుంటాం. అయేషా మీరా కేసుని సీబీఐకి అప్పచెబుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామ’ని ఆర్పీ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.

జాయింట్‌ ఆపరేషన్‌ కోరితే సీబీఐ ముందుకు రాలేదు : అనురాధ
అవినీతి అధికారిపై జాయింట్‌ ఆపరేషన్‌ చేద్దామని కోరితే సీబీఐ ముందుకు రాలేదని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనురాధ పేర్కొన్నారు. సీబీఐ ఆరోపణలపై స్పందించిన అనురాధ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం సీబిఐ ఎస్పి నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారి అవినీతిపై తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సీబీఐ అధికారికి వివరించినట్టు అనురాధ పేర్కొన్నారు. సీబీఐ ఉమ్మడి దాడికి అంగీకరించకపోవడం వల్లే ఏసిబి సొంతగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఇకనుండి ఏపీలో అవినీతికి సంబంధించిన అన్ని కేసులను ఏసీబీనే దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటంలో సీబీఐతో సహా ఏ ఇతర దర్యాప్తు సంస్ధలతో పనిచేయడానికి ఏసీబీ సిద్దంగా ఉందని అనురాధ వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top