మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్‌

AP Cm YS Jagan Launched APCOS For Outsourcing Employees - Sakshi

ఆప్కాస్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

50,449 మందికి నియామక పత్రాలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆప్కాన్‌ ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ముచ్చటించారు. (ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండ)

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘పాదయాత్ర సమయంలో ఎంతో మంది కాంట్రాక్టు‌ ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికీ లంచం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఇదే మాట వినిపించేంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చెందిన సమీప బంధువు భాస్కర్‌ నాయుడు టీడీపీ హయాంలో అనేక మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం వారిని నిలువునా దోచుకుంది. దీనిని రూపుమాపాలని ఆప్కాస్‌ను రూపొందించాం. అలాగే మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దీనిని అమలు చేస్తాం.

కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌కు చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తాం. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి.. మిగిలిన వారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారు. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం’ అని అన్నారు. ఇక ఆప్కాస్‌పై కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తీవ్ర దోపిడీకి గురయ్యామని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ భద్రతపై నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top