ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ

AP Assembly Approves Insider Trading Bill Probe On Amaravati lands - Sakshi

హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

రాజధాని ప్రకటన వెలువడక ముందే టీడీపీ నేతలు ‘అమరావతి’లో భారీగా భూములు కొన్నారు

ప్రాథమికంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు నిర్ధారణైంది

దీనిపై తగిన ఏజెన్సీతో విచారణ జరిపించాల్సిన అవసరముంది: సుచరిత

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రాథమి కంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసర ముందని సూచించిందని తెలిపారు. రాజధాని ప్రకటన వెలువడకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అమరావతిలో రాజధాని వస్తుందని తెలు సుకుని భారీగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితం సభలో సమగ్ర చర్చ జరిగిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించమని స్పీకర్‌ కూడా ఆదేశాలిచ్చారని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తగిన ఏజెన్సీతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. 

భూములను దోచిపెట్టారు..
తీర్మానంపై చర్చలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందో అన్ని ఆధారాలతో సభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరిం చారని, ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కంచే చేను మేసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కావాల్సిన వాళ్లకు భూములను చంద్రబాబు దోచిపెట్టారన్నారు. రాజధాని గురించి ముందే తెలుసుకుని ఈ ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కొని.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నూజివీడులో రానుందని, మరో ప్రాంతమని చెబుతూ తొలుత లీకులిచ్చారని, అయితే చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. చంద్రబాబుకు కొట్టే బుద్ధి ఉంటే.. జగన్‌కు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారన్నారు. సీబీఐతో విచారణ జరిపించి ఈ దొంగలందర్నీ లోపల వెయ్యాలన్నారు. 

భూసమీకరణను విధ్వంసం సృష్టించేలా చేశారు
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌కమిటీలో తానూ సభ్యుడినని, ప్రాథమికంగా 4,070 ఎకరాల మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు గుర్తించామని మంత్రి కన్నబాబు తెలిపారు. దీన్ని సమర్థిస్తూ టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ భూములు కొంటే తప్పేముందనడం దారుణమన్నారు. బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేశవ్‌ అడిగారని, ఆయన వినతి మేరకు ఆ చట్టం కింద కూడా చర్యలు చేపట్టాలని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపిన వారిపై అసైన్డ్‌ ల్యాండ్‌ 1977 యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్‌ భూములు కొనడమే తప్పంటుంటే వాటిని లీకువీరుడు చంద్రబాబు తనకు, తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. రాజధాని భూసమీకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారన్నారు. అనంతరం తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top