నగరంలోని శీతకొండ, ఎర్రకొండలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావు నాయుడు అన్నారు.
వుడా చేతికి శీతకొండ, ఎర్రకొండ
ఆ రెండింటిపై పర్యాటక హంగులు
చిన్న పట్టణాల రోడ్లు విస్తరణ
మీట్ ది ప్రెస్‌లో బాబూరావునాయుడు
విశాఖపట్నం సిటీ : నగరంలోని శీతకొండ, ఎర్రకొండలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావు నాయుడు అన్నారు. వీజేఎఫ్ ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ విదేశీ సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాభివృద్ధికి మలేషియా, అమెరికా వంటి దేశాలు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమయాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేయిస్తున్నట్టు వెల్లడించారు. వుడా చిల్డ్రన్స్ థియేటర్ పెండింగ్ పనులకు ఒకే టెండర్ దాఖలవడంతో ఆ కాంట్రాక్టు పనులు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని కొత్త టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు.
మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయో లేదో పరిశీలించే పనిని చేపట్టినట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల చిన్నచిన్న తప్పిదాలున్నట్టు గమనించామన్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్‌తో రోడ్లు వెళ్లాలనేది ప్రజలందరికీ తెలిసేలా త్వరలోనే ప్రకటనలు జారీ చేస్తామని ప్రకటించారు. ప్రజలు గమనించి అందుకు తగ్గట్టుగా ఆస్తులను కొనుగోలు చేసుకుంటారని చెప్పారు.
వుడా కార్యాలయం ధనవంతులకే అన్న అపవాదు పోయేలా పేదలకు అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే పేదల కోసం మంచి ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు.
భూసంబంధ అంశాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారని గుర్తు చేశారు. విద్యా వంతులు సైతం లే అవుట్ల నిర్వాహకుల మాయలో పడి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని చెప్పారు. అందుకే ప్రజలంద రికీ ఎల్‌పీలపై అవగాహన కలిగేలా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు.
వుడా పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తుని వంటి పట్టణాల్లో నగర రోడ్లను త్వరలో విస్తరిస్తామని ప్రకటించారు. ఆయా పట్టణాల్లో ఇరుకు రోడ్లే ఇప్పటికీ ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నాయని అందుకే మాస్టర్ ప్లాన్ మేరకు రోడ్లను విస్తరిస్తామని ప్రకటించారు.
వుడాలో గతంలో జరిగిన కుంభకోణాలన్నీ న్యాయ పరిధిలో ఉన్నందున వాటిపై తనను ప్రశ్నించవద్దని విలేకరులకు సూచించారు. కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావుతో పాటు కార్యవర్గం పాల్గొంది.