బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబానికి మరో షాక్‌

Another shock for Bharat Mathukumilli Family - Sakshi

ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ 

టెక్నో ఇన్‌ఫ్రాటెక్‌ పేరిట తీసుకున్న రూ.124.39 కోట్లు చెల్లించని వైనం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత ముతుకుమిల్లి భరత్‌ కుటుంబానికి మరో భారీ షాక్‌ తగిలింది. వందల కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొడుతుండటంతో తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. భరత్‌ కుటుంబానికి చెందిన యూనిక్‌ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ హైదరాబాద్‌ అబిడ్స్‌ కరూర్‌ వైశ్యా బ్యాంకుకు రూ. 124.39 కోట్లు బకాయి పడింది. ఆ రుణాన్ని జనవరి 21, 2020లోగా చెల్లించాలని గతంలో బ్యాంకు నోటీసులు జారీ చేసినప్పటికీ కుటుంబసభ్యులు స్పందించలేదు. దీంతో ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని ఇంటికి బ్యాంకు నోటీసులు అంటించింది. ఈ రుణానికి హామీగా ఉన్న వారందరికీ కొరియర్, స్పీడ్‌పోస్టుల ద్వారా నోటీసులు జారీ చేయగా కొంతమందికి చేరాయని, అందని వారు బ్యాంకుకు వచ్చి తీసుకోవాల్సిందిగా పేర్కొంది.

ఈ రుణానికి ప్రధాన హామీదారునిగా ఉన్న గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్‌ మూర్తి మరణించడంతో ఆయన వారసులైన పట్టాభి రామారావు (భరత్‌ తండ్రి), లక్ష్మణరావు, భారతీ వరదరాజ్‌లను హామీదారులుగా చేర్చింది.   గడువులోగా రుణాలను చెల్లించకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టిన విశాఖ జిల్లా గాజువాక మండలం, భీమిలి మండలంలోని భూములను, విశాఖ నగరం డొండపర్తి ప్రాంతంలోని ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని స్పష్టం చేసింది.  గతేడాది అక్టోబర్‌లో భరత్‌ సహా 11 మంది కుటుంబసభ్యులు, సన్నిహితులకు విశాఖ నగరంలోని ఆంధ్రా బ్యాంకు సీతమ్మధార బ్రాంచ్‌ డీ ఫాల్టర్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.  భరత్‌కు చెందిన సంస్థ మొత్తం రూ. 13.65 కోట్లు బాకీ పడిందని పేర్కొంది. కాగా, భరత్‌ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.  

బ్యాంక్‌ జారీచేసిన నోటీసు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top