అన్నదాతకు అండగా.. మళ్లీ పర్యటన | Annadataku up again on tour .. | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అండగా.. మళ్లీ పర్యటన

Nov 17 2014 1:52 AM | Updated on Oct 1 2018 2:03 PM

రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల...

సాక్షి,గుంటూరు: రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. 12 గంటలకు గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై ఒంటి గంటకు కమిటీ బోరుపాలెం చేరుకుంటుందని తెలిపారు.

కమిటీ మొదటి విడతగా ఈ నెల 13వ తేదీన తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి  పర్యటన ప్రారంభించి పెనుమాక, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామాల్లో  రైతుల అభిప్రాయాలను సేకరించింది. రెండో రోజు తుళ్లూరు మండలంలో పర్యటించాల్సి ఉండగా, వర్షం కారణంతో వాయిదా వేశారు. తిరిగి తుళ్లూరు మండలం బోరు పాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో కమిటీ పర్యటిస్తుందని మర్రి రాజశేఖర్ తెలిపారు.

  కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్ధసారథి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామ కృష్ణారెడ్డి (ఆర్కే), గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, ముస్తఫా, రైతు సంఘం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, తాడికొండ సమన్వయ కర్త క్రిస్టినా, తాడికొండ ముఖ్య నేత కత్తెర సురేష్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు.

  కమిటీ గ్రామాల్లో పర్యటించి రైతులు, కౌలు రైతులు, కూలీలు, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోందని వివరించారు. భూ సమీకరణ ద్వారా గ్రామాల్లో తలెత్తే ఇబ్బందులు,రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అంతేగాక రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతోపాటు వారి అభిప్రాయాలను  పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నివేదిస్తారని తెలిపారు.

  ఆ ప్రాంత రైతులు, కూలీలు తమ అబిఫ్రాయాలను కమిటీ ఎదుట తెలియజే యాలని మర్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement