ఏఎన్‌ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!

ANM Give Diabetes Tabs Instead Of Paracetamol To Infants In Cheerala, Prakasam District - Sakshi

45 రోజుల చిన్నారులకు తీవ్ర అస్వస్థత

జ్వరం టాబ్లెట్లకు బదులు..సుగర్‌ టాబ్లెట్లు

సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్‌ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్‌ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్‌) ఇంజెక్షన్లు ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది.

జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్‌మాల్‌ టాబ్లెట్‌ ఇవ్వాలి. ఏఎన్‌ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్‌)లకు బదులు మెట్ఫార్విన్‌ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్‌ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్‌ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ప్రైవేట్‌ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్‌ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్‌సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్‌సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. 

ఏఎన్‌ఎంపై చర్యలు
చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్‌ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్‌ఎంపై చర్యలు తీసుకుంటారు.
- శ్రీదేవి, పీహెచ్‌సీ వైద్యురాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top