సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షను
పాతగుంటూరు, న్యూస్‌లైన్ :సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న 14 మంది అంగన్‌వాడీ కార్యకర్తల ఆరోగ్యం క్షీణించడంతో నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి 12 గంటలకు దీక్ష శిబిరం వద్దకు చేరుకొన్నారు. దీక్ష విరమించాలని వారిని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు చెప్పడంతో, వారిని మహిళా పోలీసులు బలవంతంగా జీపుల్లోకి ఎక్కించి జీజీహెచ్‌కు తరలించారు.
నగరంలో అంగన్‌వాడీ కార్యకర్తల ర్యాలీ
విద్యానగర్(గుంటూరు): అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని కంకరగుంట గేటు నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకూ అంగన్‌వాడీ కార్యకర్తల, ఆయాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్‌లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐటీసీ వంటి సంస్థల జోక్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల యూనియన్ నగర అధ్యక్షురాలు షకీలా మాట్లాడుతూ అమృత హస్తం పెండింగ్ బిల్స్ వెటనే చెల్లించాలని, వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డింమాడ్స్‌ను నెరవేర్చకుంటే ఈనెల 17 నుంచి సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో క్వారీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రామయ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.