మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం

Andhra Pradesh People Praise On Three Capital In Assembly - Sakshi

సాక్షి,అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కడప: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా వైఎస్సార్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.  

కర్నూలు: కర్నూలును జూడిషియల్ క్యాపిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో  బిల్లు ప్రవేశపెట్టినందుకు కర్నూలు వైఎస్పార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు పంపిణీ చేస్తూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు.

పులివెందుల: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టినందుకు పులివెందులలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పులాంగళ్ల సర్కిల్‌లో బాణాసంచా పేల్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

అనంతపురం: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు హిందూపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదించడంపై కదిరిలో పార్టీ నాయకులు సంబరాలు చేశారు. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ.. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

నెల్లూరు: రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని కోరుతూ కావలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, అందవరపు సూరిబాబు, మెంటాడ స్వరూప్‌లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

పలాస: నియోజకవర్గంలోని కాశీబుగ్గ బస్టాండ్ వద్ద వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాల వేశారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టినందుకు కార్యకర్తలు, నేతలు సంఘీభావం తెలిపారు. విశాఖ క్యాపిటల్ నిర్ణయానికి మద్దతుగా విశాఖ నార్త్ కన్వీనర్ ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఔట్ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మద్దిలపాలెం వినాయక టెంపుల్ మీదుగా కొనసాగిన భారీ ర్యాలీలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, పార్టీ కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, పార్టీ కన్వీనర్లు కేకే రాజు, మల్ల విజయప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రొయ్య జగన్నాథం, జాన్ వెస్లీ, రొయ్య వెంకటరమణ పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి: నిడదవోలు పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీని కార్యకర్తలు నిర్వహించారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడురాజధానులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలు, గణపవరం, నిడమర్రు గ్రామాల కార్యకర్తలు, ప్రజలు ఉంగుటూరు మండల కేంద్రంలో సంఘీభావ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ గ్రామాల ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి మద్దతు పలికారు.

తాడేపల్లిగూడెంలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దేవరపల్లి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యలయం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేడుకలు నిర్వహించారు.

చింతలపూడిలో సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం ప్రవేశ పెట్టినందుకు పార్టీ కార్యకర్తలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుట్టాయిగూడెంలో ఆంధ్రప్రదేశ్ సమతుల్య అభివృద్ధి కోసం అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు భారీగా బాణాసంచా కాల్చి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ద్వారకాతిరుమలలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్న వెంకన్న పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అంటూ... జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తన్నీరు నాగేశ్వరావు, చౌడవరపు జగదీష్, షేక్. మదార్ సాహెబ్, నూకల సాంబ, నంబూరి రవి, జుబేర్, ఫిరోజ్ ఖాన్, ప్రజలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top