ఫ్యాబ్రిక్‌ హబ్‌గా ఏపీ

Andhra Pradesh as a fabric hub says Goutham Reddy - Sakshi

టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడికి అనేక అవకాశాలు

ఇన్వెస్ట్‌ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో మంత్రి గౌతంరెడ్డి 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఫ్యాబ్రిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నూలును గార్మెంట్స్‌గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న స్పిన్నింగ్, జిన్నింగ్‌లో ఏడు శాతం ఇక్కడే తయారవుతుండగా, ఇందులో అత్యధిక భాగం ఎగుమతి అవుతోందని తెలిపారు. టెక్స్‌టైల్‌ రంగంపై ఇన్వెస్ట్‌ ఇండియా నిర్వహించిన వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

► పోర్టులకు సమీపంలో టెక్స్‌టైల్‌ పార్కులను అభివృద్ధి చేయడమేగాక వస్త్రాల తయారీలో సాంకేతికతను పెంపునకు తోడ్పాటునందిస్తాం.
► రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 50% వరకు రాయితీలిస్తాం.
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలకు పూర్తి ప్రోత్సాహకాలిస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలకు ఆరేళ్ల బకాయిలను ఒకేసారి చెల్లించడంతో పాటు టెక్స్‌టైల్‌ రంగానికి ఏడేళ్ల కాలానికి సంబంధించి రూ.1,300 కోట్ల బకాయిలు చెల్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

వైఎస్సార్‌ చొరవతోనే ఏర్పాటు
► బ్రాండిక్స్‌ ఇండియా హెడ్‌ నైల్‌ రొసారో మాట్లాడుతూ శ్రీలంకలో అతిపెద్ద అప్పరెల్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీని వైఎస్సార్‌ చొరవతో విశాఖలో ఏర్పాటు చేసేందుకు 2006లో ఒప్పందం కుదుర్చుకుని, 2008లో ఉత్పత్తి ప్రారంభించడమేగాక ఏటా 25 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. 
► ప్రస్తుతం ఈ సంస్థలో 17,000 మంది మహిళలు పనిచేస్తున్నారు.. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఇదే విధమైన వృద్ధిని కొనసాగిస్తాం. 
► రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం వివరించారు.
► వెబినార్‌లో కేంద్ర చేనేత శాఖ మంత్రి స్మృతి ఇరానీతో పాటు కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ కార్యదర్శి రవికపూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top