ఆంధ్రప్రదేశ్‌పై ప్రకృతి ప్రకోపం

Andhra Pradesh Battered With Huge Tides And Thunder Bolts - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో ‘ఏ పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందో...?’ అని అంటుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పరిస్థితి ఇదే. ఒకవైపు బంగాళాఖాతంలో భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుంటే.. మరోవైపు బుధవారం రాష్ట్రాన్ని పిడుగులు కుదుపునకు గురి చేశాయి. కేవలం 13 గంటల్లో 36 వేల 749 పిడుగులు పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోయారు.

నైరుతి హిందూ మహాసముద్రంలో (మడగాస్కర్‌కు ఈశాన్య ప్రాంతంలో) ఏర్పడిన తుపాను ఫకీర్‌ వల్ల ఈ నెల 23 నుంచి ప్రచండ గాలులు భారత పశ్చిమ, తూర్పు తీరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో అంతర్భాగాలైన అరేబియా, బంగాళాఖాతం వైపు వీచాయి. గాలుల పెను తాకిడికి కదలిన కడలి అలలు భారీ ఎత్తున వచ్చి మన తీరాలను తాకాయి.

3 నుంచి 4 మీటర్ల ఎత్తులో వచ్చిన అలల తాకిడి తీరం ప్రాంతాలు నష్టాన్ని చవిచూశాయి. 2004లో సిమియూల్‌ సునామీ వల్ల భారత తీర ప్రాంతాలపై విరుచుకుపడ్డ అలలు ఎత్తు 10 మీటర్లు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సంభవించింది. ఇదే సమయంలో భారీ ఎత్తున పిడుగులు పడ్డాయి. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు వదిలారు. మంగళవారం ఆరుగురు మృతి చెందారు. దేశంలో అత్యధికంగా పిడుగుల పడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంది.

గత ఏడాది మే నుంచి అక్టోబరు నెలల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పడిన పిడుగుల సంఖ్య 2,62,940 . వీటి వల్ల దాదాపు 61 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మడగాస్కర్‌ వద్ద ఏర్పడిన ఫకీర్‌ తుపాను గురువారం బలహీనపడింది. ఈ లోగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సూర్యుడి భగభగలకు భూమి, సముద్రాల్లో ముందు భూమి వేడెక్కాలి. కానీ వాతావరణ మార్పుల కారణంగా సముద్రం ముందు వేడెక్కుతుండటంతో ఇతర ప్రదేశాల్లోని అధిక పీడన గాలులను ఆకర్షిస్తూ అల్పపీడనాలను ఏర్పరచి అకాల వర్షాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనానికి కారణం ఇదే. బుతువుల క్రమం చెడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వర్షాల సమయంలో భారీగా ఏర్పడుతున్న మేఘాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని పిడుగుల పడటానికి కారణం అవుతున్నాయి.

సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజన్‌లో ఉరుములు, మెరుపుల ప్రభావంతో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి.  పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రిటైర్డ్‌ అధికారి డాక్టర్‌ నరసింహారావు వివరించారు.

గుర్తించండి.. ఇలా చేయండి
- ఉరుముల శబ్దం వినిపిస్తే మేఘాలు తక్కువ ఎత్తులో ఉన్నాయని, పిడుగులు పడే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఆకాశం మేఘావృతమై గాలివాన కురుస్తున్నా జాగ్రత్త వహించాలి.
- పొలాల్లో పని చేసేవారు లేదా బయట నిలుచున్న వారు వెంటనే సమీపంలోని సురక్షిత భవనంలోకి చేరుకోవాలి.
- వర్షం, గాలులు, ఉరుముల శబ్ధం సమయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్లకూడదు.
- చిన్న కాంక్రీటు ఇంటి కంటే పెద్ద భవనాలు సురక్షితం.

పిడుగుపాటు అంటే..
మేఘాలు పరస్పరం రాసుకున్నప్పుడు లేదా ఒక మేఘంలోని అణువులు రాసుకుంటే విద్యుదాఘాతం ఏర్పడుతుంది. ఒక మేఘం నుంచి మరో మేఘంలోకి విద్యుదాఘాతం వెళితే భారీ వెలుతురు కనిపిస్తుంది. దాన్నే మెరుపు అంటారు. విద్యుదాఘాతం మేఘంలోకి కాకుండా నేలవైపు రావడాన్ని పిడుగు అంటారు. మేఘాలు లేదా అణువులు రాసుకోవడంవల్ల మిలియన్‌ ఓల్టుల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంత అధిక పరిమాణంతో కూడిన విద్యుత్తు కిరణం నేలవైపు దూసుకు రావటంతో ఆ మార్గం తీవ్రంగా వేడెక్కి గాలి వ్యాకోచం చెందుతుంది. అందువల్లే పిడుగుపాటు సమయంలో పెద్ద శబ్ధం వస్తుంది. పిడుగులు పడే చోట తీవ్రమైన వేడికి చెట్లు సైతం నల్లగా మాడిపోతాయి. మనుషులైతే కాలి బొగ్గులా మారిపోతారు.

ఆకర్షించే ఎత్తయిన చెట్లు
ఆకాశం నుంచి నేలపైకి వచ్చే సమయంలో అనువైన మార్గాన్ని పిడుగు అన్వేషిస్తుంది. ఎత్తయిన చెట్లు వాటిని ఆకర్షిస్తాయి. దీనివల్లే తాటిచెట్లు, కొబ్బరిచెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. చెట్లే కాదు సన్నగా, పొడవుగా ఉన్నవి కూడా పిడుగులను ఆకర్షిస్తాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top